బ‌డుగుల‌కే పెద్ద పీట‌.. జ‌గ‌న్ కేబినెట్ కూర్పుపై సజ్జ‌ల కామెంట్‌

  • బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు పెద్ద పీట‌
  • కేబినెట్ కూర్పు మొత్తం జ‌గ‌న్ చేతుల్లోనే
  • మెజారిటీ మార్పులు త‌ప్ప‌వ‌న్న స‌జ్జ‌ల‌
ఏపీ కేబినెట్ పునర్వ్యవ‌స్థీక‌ర‌ణ ఈ నెల 11న జ‌రుగుతుంద‌ని అంతా అనుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే దీనిపై ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌త మాత్రం ఇప్పటిదాకా రాలేదు. తేదీ ఖ‌రారు కాకున్నా.. కేబినెట్ పునర్వ్యవ‌స్థీక‌ర‌ణ అయితే ఖాయ‌మే. కొత్త కేబినెట్ ఎలా ఉంటుంద‌న్న దానిపై ఎవ‌రికి తోచిన విధంగా వారు విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగానే కాకుండా ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారుగా ఉన్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కేబినెట్ పునర్వ్యవ‌స్థీక‌ర‌ణ ఎలా ఉంటుంద‌న్న దానిపై కాస్తంత వివ‌రంగానే చెప్పేశారు.

ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌ల మాట్లాడుతూ, 'మంత్రివర్గ పునర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌ మొత్తాన్ని సీఎం జగన్ చూస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా కేబినెట్ విస్తరణ ఉంటుంది. కేబినెట్‌లో మెజార్టీ మార్పులు ఉంటాయి. సోషల్ జస్టిస్‌కు అనుగుణంగా సీఎం జగన్ కొత్త‌ కేబినెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు' అంటూ స‌జ్జ‌ల చెప్పుకొచ్చారు. మొత్తంగా సామాజిక స‌మీక‌ర‌ణాలే ప్రామాణికంగా సాగ‌నున్న జ‌గ‌న్ కేబినెట్ పునర్వ్యవస్థీక‌ర‌ణ బ‌డుగుల‌కు పెద్ద పీట వేసేదిగా ఉంటుంద‌న్న మాట‌.


More Telugu News