శ్రీలంకలో భారీ బందోబస్తు మధ్య తెరుచుకున్న దుకాణాలు

  • దేశంలో నిన్నటి నుంచి ఎమర్జెన్సీ
  • ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం
  • ఎమర్జెన్సీపై అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు
శ్రీలంక రాజధాని కొలంబోలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత తొలిరోజు ఇవాళ దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే, భారీ బందోబస్తు మధ్య షాపులను తెరిచారు. ఆహార, ఆర్థిక సంక్షోభంతో కుదేలైపోయిన శ్రీలంకలో కొన్ని రోజుల క్రితం ఆందోళనకారులు తీవ్రమైన నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. అవికాస్తా హింసాత్మకమయ్యాయి. ఈ క్రమంలోనే ఆ దేశ ప్రభుత్వం నిన్న ఆత్యయిక స్థితిని విధించింది. 

ఆందోళనకారులు, ఆందోళనలకు కారణమవుతున్న అనుమానితులను అరెస్ట్ చేయాలంటూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఆదేశాలూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రజలకు అత్యవసరాలు, నిత్యావసరాలు సక్రమంగా అందేలా చూసేందుకు షాపుల వద్ద అధికారులు బలగాలను మోహరించారు. కాగా, ఎమర్జెన్సీ విధించినప్పటి నుంచి ఇప్పటిదాకా 53 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

కాగా, శ్రీలంకలో ఎమర్జెన్సీపై అమెరికా రాయబారి జూలీ చూంగ్ స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తమ నిరసనను శాంతియుతంగా తెలియజేసే హక్కుందని అన్నారు. శ్రీలంకలోని పరిణామాలను దగ్గర్నుంచి పరిశీలిస్తున్నామని, కొన్ని రోజుల్లోనే పరిస్థితి సద్దుమణుగుతుందని భావిస్తున్నానని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోపక్క, అక్కడ తిండి గింజల కొరత ఉండడంతో భారత్ 40 వేల టన్నుల బియ్యాన్ని సాయంగా పంపిస్తోంది.


More Telugu News