పాత‌బ‌స్తీలో ఐసిస్ సానుభూతిప‌రుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు

  • ఐసిస్‌కు అనుకూలంగా సులేమాన్ ప్ర‌చారం
  • ఐపీ అడ్రెస్ ఆధారంగా సులేమాన్‌ గుర్తింపు
  • సులేమాన్ పేరుపై సోష‌ల్ మీడియాలో 20 ఖాతాలు
  • తీవ్ర‌వాదం వైపు యువ‌త‌ను ఆక‌ర్షించేలా పోస్టులు
హైద‌రాబాద్‌లో ఉగ్ర‌వాదానికి ఊత‌మిచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్న వ్య‌క్తులు నిత్యం బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నారు. అందులో భాగంగా న‌గ‌రంలోని పాత‌బ‌స్తీలో శ‌నివారం నాడు ఐసిస్ ఉగ్ర‌వాదుల‌కు సానుభూతిప‌రుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ సులేమాన్ అనే వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సులేమాన్ నేరుగా ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల్లో పాలుపంచుకోన‌ప్ప‌టికీ..న‌గ‌రానికి చెందిన యువ‌త ఉగ్ర‌వాదం వైపు ఆక‌ర్షితుల‌య్యేలా సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతున్న‌ట్లుగా పోలీసులు నిర్ధారించారు.

ఐసిస్‌కు అనుకూలంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైనంపై దృష్టి సారించిన పోలీసులు.. ఆ పోస్టుల ఐపీ అడ్రెస్ ఆధారంగా పాత‌బ‌స్తీ నుంచే సులేమాన్ అనే వ్య‌క్తి స‌ద‌రు పోస్టుల‌ను పోస్ట్ చేస్తున్నాడ‌ని పోలీసులు నిర్ధారించారు. ఆ వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు సులేమాన్‌ను అరెస్ట్ చేశారు. విచార‌ణ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా సులేమాన్ ఏకంగా 20 ఖాతాల‌ను తెర‌చి యువ‌త‌ను ఉగ్ర‌వాదం వైపు మ‌ళ్లేలా చేస్తున్నాడ‌ని పోలీసులు తేల్చారు.


More Telugu News