వరంగల్ ఎంజీఎంలో ఎలుకల దాడిలో గాయపడిన రోగి శ్రీనివాస్ మృతి

  • ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఎలుకల దాడిలో గాయపడిన కడార్ల శ్రీనివాస్
  • మంత్రి హరీశ్ రావు ఆదేశంతో హైదరాబాద్ ‘నిమ్స్’కు తరలింపు
  • అక్కడ చికిత్స పొందుతూ గతరాత్రి మృతి
  • నిందితుడైన మూషికాన్ని పట్టుకున్నామంటూ వైద్య సిబ్బంది ట్వీట్
  • ఎంజీఎం సూపరింటెండెంట్, డ్యూటీ డాక్టర్లపై చర్యలు వెనక్కి తీసుకోవాలని వైద్యుల సంఘం డిమాండ్
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎలుకల దాడిలో తీవ్రంగా గాయపడిన కడార్ల శ్రీనివాస్ (38) గత రాత్రి మృతి చెందాడు. హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ తీవ్ర అనారోగ్య సమస్యలతో ఎంజీఎం ఆసుపత్రిలో చేరాడు. అక్కడాయనను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో గదిలోని ఎలుకలు శ్రీనివాస్‌పై దాడిచేసి శరీరాన్ని కొరికేశాయి. స్పర్శ కోల్పోయిన ఆయన ఈ విషయం తెలుసుకోలేకపోయాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. 

విషయం వెలుగులోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. స్పందించిన రాష్ట్రప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ఇద్దరు డ్యూటీ డాక్టర్లపై చర్యలు తీసుకుంది. ఎలుకల దాడిలో గాయపడిన శ్రీనివాస్‌ను మంత్రి హరీశ్‌రావు ఆదేశంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో గత రాత్రి శ్రీనివాస్ మృతి చెందాడు.

మరోవైపు, శ్రీనివాస్‌ను ఎలుకలు కొరికిన తర్వాత అప్రమత్తమైన ఎంజీఎం సిబ్బంది ఆర్ఐసీయూ వార్డులో ఎలుకలను పట్టుకునేందుకు బోన్లు, ప్యాడ్లు ఏర్పాటు చేశారు. మళ్లీ వార్డులోకి వచ్చిన ఓ మూషికం బోనులో పడింది. దీంతో అసలైన నిందితుడిని పట్టుకున్నామంటూ వైద్య సిబ్బంది సోషల్ మీడియా ద్వారా చేసిన పోస్టు వైరల్ అయింది. 

ఇంకోవైపు, ఎంజీఎం సూపరింటెండెంట్, వైద్యులపై చర్యలు తీసుకోవడాన్ని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్రంగా ఖండించింది. వైద్యుల పని ఎలుకలను పట్టుకోవడం కాదని పేర్కొంది. వారిపై తీసుకున్న చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని, ఇంకా అవసరమైతే సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.


More Telugu News