ఏపీ ఎమ్మెల్సీ వాకాటికి సుప్రీంకోర్టులో ఊర‌ట‌

  • టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన వాకాటి
  • రుణం ఎగ‌వేత‌కు సంబంధించి సీబీఐ కేసు న‌మోదు
  • టీడీపీ నుంచి స‌స్పెండ్ చేసిన టీడీపీ అధినేత‌
  • ఆ త‌ర్వాత‌ బీజేపీలోకి చేరిపోయిన ఎమ్మెల్సీ
  • బెయిల్ షరతులు స‌వరిస్తూ తాజా ఆదేశాలు 
ఏపీకి చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌, ఏపీ శాస‌న‌మండ‌లిలో ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్న వాకాటి నారాయ‌ణ రెడ్డికి శుక్ర‌వారం నాడు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. రుణం ఎగ‌వేత కేసులో బెయిల్‌పై ఉన్న నారాయ‌ణ రెడ్డి ఇక‌పై ప్ర‌తి 10 రోజుల‌కు ఒక‌సారి హైద‌రాబాద్‌లోని సీబీఐ కార్యాల‌యంలో సంత‌కం చేయాల్సిన అవ‌స‌రం లేకుండా బెయిల్ ష‌ర‌తుల‌ను స‌డ‌లిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీగా 2017లో నెల్లూరు జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వాకాటిపై రుణం ఎగ‌వేత‌కు సంబంధించి సీబీఐ కేసు న‌మోదు చేసింది. దీంతో కొంత‌కాలం పాటు తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొన్న వాకాటి.. టీడీపీ నుంచి స‌స్పెన్ష‌న్ కు గుర‌య్యారు.ఆ త‌ర్వాత ఆయ‌న‌ బీజేపీలో చేరిపోయారు. ప్ర‌స్తుతం ఏపీ శాస‌న‌మండ‌లిలో ఆయ‌న బీజేపీ సభ్యుడిగానే కొన‌సాగుతున్నారు. త‌న‌పై న‌మోదైన కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న వాకాటి చాలా కాలం నుంచి పెద్ద‌గా బ‌య‌ట‌కే రావ‌డం లేదు.

ఈ క్ర‌మంలో ప్ర‌తి 10 రోజుల‌కు ఒక‌సారి హైద‌రాబాద్‌లోని సీబీఐ కార్యాల‌యానికి వెళ్లి సంత‌కం చేయ‌డం త‌నకు ఇబ్బందిగా ఉంద‌ని భావించిన వాకాటి.. బెయిల్ ష‌ర‌తు నిబంధ‌న‌ల నుంచి దానిని తొల‌గించాల‌ని మ‌రోమారు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. 

ఈ పిటిష‌న్‌పై శుక్ర‌వారం విచార‌ణ జ‌ర‌గ‌గా.. ఇప్ప‌టిదాకా తాను బెయిల్ ష‌ర‌తుల‌ను ఏమాత్రం ఉల్లంఘించ‌లేద‌ని వాకాటి కోర్టుకు తెలిపారు. దీంతో ప్ర‌తి 10 రోజుల‌కు ఒక‌సారి సీబీఐ కార్యాల‌యానికి వెళ్లాల‌న్న నిబంధ‌న‌ను తొల‌గిస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేర‌కు బెయిల్ ష‌ర‌తుల‌ను సుప్రీంకోర్టు స‌వ‌రిస్తూ ఆదేశాలు జారీచేసింది.


More Telugu News