ఆఫ్ఘనిస్థాన్ లో కొత్త రూల్.. గడ్డాలు లేకుండా కార్యాలయాలకు రాకూడదు!

  • పాశ్చాత్య దుస్తులు ధరించకూడదు
  • సంప్రదాయ వస్త్ర ధారణతోనే రావాలి
  • తలకు టర్బాన్ పెట్టుకోవాలి
  • ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊడిపోతుంది
  • తాలిబన్ సర్కారు తాజా ఆదేశాలు
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ సర్కారు అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నిబంధన తీసుకొచ్చింది. పురుష ఉద్యోగులు గడ్డాలు లేకుండా వస్తే కార్యాలయాల్లోకి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వారు గడ్డాలను పెంచాల్సిందే. తీయడానికి వీలులేదు. 

దీనికితోడు పాశ్చాత్య దుస్తులు ధరించకూడదంటూ హుకుం జారీ చేసింది. వాటికి బదులు సంప్రదాయ వస్త్రాలైన పొడవాటి కుర్తా, ట్రోజర్లు ధరించొచ్చని సూచించింది. అలాగే, తలను టోపీ లేదా టర్బాన్ తో కప్పుకోవాలని ఆదేశించింది. 

ఇస్లామిక్ చట్టం ప్రకారం రోజులో ఆరు సార్లు సరైన వేళల్లో నమాజ్ చేయాలని నిర్దేశించింది. ఈ నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా పాటించకపోతే వారిని కార్యాలయాల్లోకి అనుమతించకపోవడమే కాకుండా.. ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని అక్కడి సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాల వద్ద తనిఖీ చేసిన తర్వాతే ఉద్యోగులను పంపిస్తుండడం కనిపించింది. 

హైస్కూళ్లకు బాలికలను అనుమతించకపోవడం, మహిళలు మగవారు తోడు లేకుండా ఒంటరిగా ప్రయాణించడాన్ని తాలిబన్ సర్కారు ఇప్పటికే నిషేధించడం తెలిసిందే. విదేశీ డ్రామా షోలను కూడా నిషేధించింది.


More Telugu News