నిన్న పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అమెరికా

  • పాక్‌ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు
  • ఇమ్రాన్ చేసిన‌ ఆరోపణల్లో అర్థం లేదు
  • పాకిస్థాన్‌ రాజ్యాంగం, అక్క‌డి చట్టాలపై మాకు గౌర‌వం ఉంది
  • పాకిస్థాన్‌లోని పరిస్థితులను ప‌రిశీలిస్తున్నామ‌న్న అమెరికా
పాకిస్థాన్‌లో త‌న ప్ర‌భుత్వం ప‌డిపోవాల‌ని కొన్ని విదేశీ శ‌క్తులు ప్ర‌య‌త్నిస్తున్నాయంటూ నిన్న పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ప‌లు ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్‌-ర‌ష్యా మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో తాను మాస్కోలో పర్యటించడం నచ్చక త‌న‌పై ఓ దేశం కుట్ర‌లు ప‌న్నింద‌ని అన్నారు. త‌న ప్ర‌సంగంలో ప‌రోక్షంగా అమెరికాపై ఆయ‌న ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. 

దీంతో ఆయ‌న వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. పాక్‌ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం త‌మ‌కు లేదని అమెరికా తెలిపింది. ఇమ్రాన్ చేసిన‌ ఆరోపణల్లో అర్థం లేదని శ్వేత‌సౌధం ఉన్నతాధికారి కేట్‌ బెడింగ్‌ఫీల్డ్ చెప్పారు. తనను అధికారం నుంచి దింపేయాలని అమెరికా ప్రయత్నిస్తోందంటూ ఇమ్రాన్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. 

పాకిస్థాన్‌ రాజ్యాంగం, అక్క‌డి చట్టాలపై అమెరికాకు గౌరవం ఉందని చెప్పారు. పాకిస్థాన్‌లోని పరిస్థితులను తాము ఎప్పటికప్పుడు ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై తాము ఇంత‌కుమించి స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వం ప‌త‌నం అంచున ఉన్న నేప‌థ్యంలో నిన్న జాతినుద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఆ స‌మ‌యంలో భార‌త్ పై కూడా ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు.


More Telugu News