గజదొంగలు సైతం విస్తుపోయేలా జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు: చంద్రబాబు

  • ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారన్న చంద్రబాబు
  • ప్రజలపై రూ.42,172 కోట్ల భారం మోపారని ఆరోపణ
  • పరిశ్రమలు ముందుకు రావని వ్యాఖ్య  
  • నిరుద్యోగిత పెరిగిపోతుందన్న బాబు   
  • టీడీపీ ముఖ్యనేతలతో వర్చువల్ భేటీ
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ప్రమాణ స్వీకారం నాడు ప్రకటించిన జగన్ ఈ మూడేళ్లలో ప్రజలపై రూ.42 వేల కోట్లకు పైగా భారం మోపారని ఆరోపించారు. ఏపీలో ఉన్న విద్యుత్ చార్జీలు చూస్తే ఏ పరిశ్రమ కూడా ముందుకు రాదని స్పష్టం చేశారు. పరిశ్రమలు లేకపోతే నిరుద్యోగిత మరింత పెరుగుతుందని హెచ్చరించారు. 

ఓవైపు పెట్రో ధరల పెంపు, ఆస్తి పన్ను, చెత్త పన్ను, మద్యం ధరలు, సిమెంట్ ధరల పెంపుతో మధ్య తరగతి ప్రజలు అల్లాడుతుంటే, విద్యుత్ చార్జీలు పెంచుతున్నాడని, పన్నులు విధిస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. తద్వారా పైశాచిక ఆనందం పొందుతున్నాడని మండిపడ్డారు. గజదొంగలు సైతం విస్తుపోయేలా ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. 

కేవలం సంపన్న వర్గాల కోసమే జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో విద్యుత్ కోతలు లేకుండా చేసి, నాణ్యమైన కరెంటు అందించామని చంద్రబాబు అన్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని వ్యాఖ్యానించారు. ఏడు పర్యాయాలు కరెంట్ చార్జీలు పెంచారని, విద్యుత్ వినియోగం అంటేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. 

పార్టీ ముఖ్యనేతలతో వీడియో సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి విద్యుత్తు ఎంతో కీలకమైన అంశమని, కానీ సొంత అజెండాతో సీఎం జగన్ మొత్తం నాశనం చేస్తున్నాడని విమర్శించారు.


More Telugu News