వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి దర్శన టోకెన్ల విడుదల ఏప్రిల్ 8కి వాయిదా

  • బాగా తగ్గిన కరోనా వ్యాప్తి
  • క్రమంగా దర్శనాల పునరుద్ధరణ చేపట్టిన టీటీడీ
  • వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సమయాల్లో దర్శనం
వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారిని సులువుగా దర్శించుకునేందుకు వీలుగా టీటీడీ టోకెన్లు జారీ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. వాస్తవానికి ఇవాళ టోకెన్లు జారీ చేయాల్సి ఉండగా, అనుకోని అవాంతరాల వల్ల అది వాయిదా పడింది. దర్శన టికెట్లు జారీ చేయాల్సిన తరుణంలో సాఫ్ట్ వేర్ మొరాయించిందని, సాంకేతిక సమస్య కారణంగా టికెట్లు జారీ చేయలేకపోతున్నామని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి దర్శనం టికెట్ల జారీని ఏప్రిల్ 8కి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. 

కరోనా కారణంగా చాలాకాలం భక్తుల దర్శనాలు నిలిపివేసిన టీటీడీ.... తాజాగా కరోనా కేసులు బాగా తగ్గిపోవడంతో దర్శనాలను క్రమంగా పునరుద్ధరిస్తోంది. సర్వదర్శనం టికెట్లను కూడా ఆఫ్ లైన్ లో అందిస్తోంది. అంతేకాకుండా, వృద్ధులు, దివ్యాంగులు ప్రతి రోజు ఉదయం 10 గంటల సమయంలో, శుక్రవారం మాత్రం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించింది. 

సాఫ్ట్ వేర్ సమస్య నేపథ్యంలో, ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 11 గంటలకు టోకెన్లను ఆన్ లైన్ విధానంలో జారీ చేయనున్నట్టు టీటీడీ తాజాగా వెల్లడించింది.


More Telugu News