కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్ర‌త్యేక చ‌ట్టం ప‌రిధి కుదింపు

  • ఈశాన్య రాష్ట్రాల్లో ఏళ్ల త‌ర‌బ‌డి అమలులో ఏఎఫ్ఎస్‌పీఏ
  • ఈ చ‌ట్టంతో సైనిక బ‌లగాల‌కు విశేష అధికారాలు
  • ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెల‌కొంద‌ని ప్ర‌క‌టించిన అమిత్ షా
కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, అస్సాం, మ‌ణిపూర్‌ల‌లో ఏళ్ల త‌ర‌బ‌డి అమ‌లవుతున్న ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్సెష‌ల్ ప‌వ‌ర్స్ యాక్ట్ (ఏఎఫ్ఎస్‌పీఏ) ను కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమితం చేస్తూ గురువారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మూడు రాష్ట్రాల్లో ద‌శాబ్దాల త‌ర‌బ‌డి అమ‌లవుతున్న ఈ చ‌ట్టాన్ని మోదీ నేతృత్వంలోని త‌మ ప్ర‌భుత్వం కుదిస్తోంద‌ని ఆయ‌న ప్ర‌కటించారు. 

ఈశాన్య రాష్ట్రాల్లో చాలా కాలం కిందట అమ‌ల్లోకి వ‌చ్చిన ఈ చ‌ట్టంతో సైనిక బ‌ల‌గాల‌కు ప్ర‌త్యేక అధికారాలు ద‌ఖ‌లు ప‌డ్డాయి. ఈ చ‌ట్టం ఆసరాతో ఈ రాష్ట్రాల్లోని ఏ ప్రాంతంలో అయినా, ఏ వ్యక్తిని అయినా ఎలాంటి ముంద‌స్తు నోటీసులు లేకుండానే అదుపులోకి తీసుకునే అధికారం సైనిక బ‌ల‌గాల‌కు ద‌క్కింది. ఈ దిశ‌గా సైనిక బ‌ల‌గాల‌ను ప్ర‌శ్నించే అధికారం ఏ ఒక్కరికీ లేకుండా పోయింది. ఈ చ‌ట్టం ఎత్తివేత‌కు ఈ రాష్ట్రాల్లోని సంఘాలు ప‌లు ఆందోళ‌న‌లు కూడా చేప‌ట్టాయి.

త‌మ ప్ర‌భుత్వం తీసుకున్న ప‌క‌డ్బందీ చ‌ర్య‌ల కార‌ణంగా ఈశాన్య రాష్ట్రాల్లో తిరిగి శాంతి నెల‌కొంద‌ని, ఈ కార‌ణంగానే ఈ చ‌ట్టం అమ‌లు అయ్యే ప్రాంతాల‌ను కుదిస్తున్నామ‌ని అమిత్ షా అభిప్రాయ‌ప‌డ్డారు. ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు దారుల‌ అణ‌చివేత కోసం ఈ చ‌ట్టాన్ని గ‌త ప్ర‌భుత్వాలు అమ‌లు చేశాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.


More Telugu News