ఈ విష‌యం తెలుసుకోలేక మోసపోయాం: ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై రేవంత్ రెడ్డి ఎద్దేవా

  • అధికారంలోకి వస్తే జీడీపీ పెంచుతామ‌ని మోదీ అన్నారు
  • అంటే దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ) అని ప్రజలు భావించారు
  • కానీ జీ అంటే గ్యాస్, డీ అంటే డీజిల్, పీ అంటే పెట్రోల్ ధరలు 
  • 2014లో వంట‌ గ్యాస్‌ 410 రూపాయ‌లు 
  • ఇప్పుడు 1,050 రూపాయ‌లు
పెట్రోల్‌, డీజిల్, వంట గ్యాస్‌ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఢిల్లీలోని విజ‌య్ చౌక్ వ‌ద్ద రాహుల్ గాంధీ నేతృత్వంలో చేప‌ట్టిన నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌లో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వంపై చుర‌క‌లు అంటించారు. 

తాము అధికారంలోకి వస్తే జీడీపీ పెంచుతామ‌ని 2014 ఎన్నిక‌ల‌కు ముందు న‌రేంద్ర‌ మోదీ చెప్పార‌ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అంటే దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ) అని ప్రజలు భావించారని, కానీ జీ అంటే గ్యాస్, డీ అంటే డీజిల్, పీ అంటే పెట్రోల్ ధరలు అని తెలుసుకోలేక మోసపోయామ‌ని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనలో సామాన్యులు సమిధలుగా మారుతున్నార‌ని అన్నారు. 

కాంగ్రెస్ 2014లో అధికారం నుంచి దిగిపోయిన స‌మ‌యంలో 410 రూపాయ‌లు ఉన్న‌ వంట గ్యాస్ ధ‌ర ఇప్పుడు 1,050 రూపాయ‌ల వ‌ర‌కు పెరిగింద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. సామాన్యులు భ‌రించ‌లేని విధంగా ధ‌ర‌లు పెంచే స్థితికి వ‌చ్చిన‌ప్ప‌టికీ దేశాన్ని తాము అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్నామ‌ని బీజేపీ అబ‌ద్ధాలు చెప్పుకుంటోంద‌ని ఆయ‌న అన్నారు.


More Telugu News