ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌ను హ‌త్య చేసేందుకు కుట్ర‌: పీటీఐ సీనియ‌ర్ నేత ఫైజల్‌ వవ్దా ఆరోపణలు

  • ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది
  • మా రాజకీయాలను ప్రభావితం చేయాలని కొన్ని బయటి శక్తుల య‌త్నం 
  • అందుకే పాక్‌లో రాజకీయ సంక్షోభానికి తెర లేపాయన్న ఫైజ‌ల్
పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన విష‌యం తెలిసిందే. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్ప‌కూలే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయి. జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మైనారిటీలో పడడంతో అధికార‌ పీటీఐ పార్టీ సీనియ‌ర్ నేత ఫైజల్‌ వవ్దా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయ‌న అన్నారు. ఇమ్రాన్‌ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని, త‌మ దేశ‌ రాజకీయాలను ప్రభావితం చేయాలని కొన్ని బయటి శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అందుకే పాక్‌లో రాజకీయ సంక్షోభానికి తెర లేపాయని చెప్పుకొచ్చారు. త‌మ‌ దేశ ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఇమ్రాన్‌ మొండిగా ముందుకెళ్తుండ‌డం‌తో ఆయ‌నను హ‌త్య చేయాల‌ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 

పీటీఐకు చెందిన‌ ఇత‌ర నేత‌లు కూడా ఇమ్రాన్‌ హత్యకు కుట్ర జరుగుతోందని, ఈ మేర‌కు ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి స‌మాచారం అందించాయని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని నిఘా వర్గాలు చెప్పాయ‌ని ఆయ‌న అన్నారు. ఇమ్రాన్ ఖాన్ మాత్రం చావుకు భయపడనని చెప్పార‌ని పీటీఐ నేత‌లు చెప్పుకొస్తున్నారు. మరోపక్క, పీటీఐ నేత‌లు చేస్తోన్న వ్యాఖ్య‌ల‌ను ప్రతిపక్ష నేత‌లు కొట్టిపారేస్తున్నారు. 

ఇదిలావుంచితే, పాక్‌ ప్రభుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని ఇమ్రాన్ ఖాన్ కూడా ఇప్ప‌టికే ఆరోప‌ణ‌లు గుప్పించారు. త‌మ దేశంలోని ప్రతిపక్షాలకు విదేశీ శ‌క్తులు ధ‌నాన్ని ఎర చూపుతున్నాయని చెప్పుకొచ్చారు. సంకీర్ణ ప్ర‌భుత్వంలోని పీటీఐయేత‌ర పార్టీలు కూడా విపక్షాల అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తామని ప్రకటించాయి. అంతేగాక‌, పీటీఐలో ఉంటూనే ఇమ్రాన్ ఖాన్‌ను వ్యతిరేకిస్తున్న కొంద‌రు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెబుతున్నారు. 

ఈ నేప‌థ్యంలో ఇమ్రాన్‌ ప్రభుత్వ పతనం ఖాయమ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇదే జరిగితే పాకిస్థాన్‌ చరిత్రలో ఒక ప్రధాని అవిశ్వాసం ద్వారా పదవీచ్యుతుడు కావడం ఇదే తొలిసారి కానుంది. నిన్న‌ సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించాలనుకున్న ఇమ్రాన్ ఖాన్ ఆ ప‌ని చేయ‌లేదు. ఆయ‌న‌ ఇప్పటికే నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాలనే ఆలోచనలోనూ ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది.


More Telugu News