వ‌చ్చే నెల 8వ తేదీ వ‌ర‌కే నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్

  • ఫిబ్రవరి 25 నుంచి కొన‌సాగుతోన్న‌ ఎగ్జిబిష‌న్ 
  • ఏప్రిల్‌ 10 వరకు కొనసాగించాల‌ని ముందుగా నిర్ణ‌యం
  • శ్రీరామ నవమితో పాటు ఇతర వేడుకలు
  • ఎగ్జిబిష‌న్‌కు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయలేమన్న‌ పోలీసులు
హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లిలో నిర్వ‌హిస్తోన్న అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన (నుమాయిష్‌) వ‌చ్చేనెల 8నే ముగియ‌నుంది. జనవరి 1న ఈ ఎగ్జిబిష‌న్‌ను తెలంగాణ‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేతుల మీదుగా ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే, క‌రోనా నిబంధ‌న‌ల వ‌ల్ల మరుసటి రోజే అత్యవసరంగా మూసివేశారు. అయితే, ఫిబ్రవరి 25న ఎగ్జిబిష‌న్ మ‌ళ్లీ ప్రారంభమైంది. 

దాన్ని ఏప్రిల్‌ 10 వరకు కొనసాగించాల‌ని భావించారు. అయితే, శ్రీరామ నవమితో పాటు ఇతర వేడుకలు ఉండ‌డంతో ఎగ్జిబిష‌న్‌కు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయలేమని పోలీసులు తెలిపారు. దీంతో తాజాగా స‌మావేశ‌మైన‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ వచ్చే నెల 8వ తేదీ వరకే నుమాయిష్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఇకపోతే, ఇప్పటి వరకు ఎగ్జిబిష‌న్‌ను ఎనిమిది లక్షల మంది సందర్శించారు. 


More Telugu News