దినేష్ కార్తీక్.. ధోనీ తరహా ‘కూల్ ఫినిషర్’: ఫాప్ డూప్లెసిస్

  • ఐస్ కూల్ గా ఉండగలడు
  • మంచి ఫినిషింగ్ నైపుణ్యాలు ఉన్నాయి
  • కలసికట్టుగా పోరాడాము
  • సభ్యుల నుంచి సహకారం ఉందన్న ఆర్సీబీ కెప్టెన్ 
ఐపీఎల్ 2022 సీజన్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్.. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో తొలి విజయం అందుకుంది. ఇందులో దినేష్ కార్తీక్ కీలక పాత్ర విస్మరించరానిది. చివరి ఓవర్ వరకు నిలిచి, చక్కని షాట్లతో విజయాన్ని అందించాడు. దీంతో ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డూప్లెసిస్ కార్తీక్ ప్రతిభను మెచ్చుకున్నాడు. ఎంఎస్ ధోనీ తరహా ఫినిషింగ్ (ఆట ముగింపు) నైపుణ్యాలు కార్తీక్ లో ఉన్నాయని పేర్కొన్నాడు. 

‘‘అనుభవం వుంటే చాలు. పరుగులు తీయడం పెద్ద సమస్య కాదు. మా చేతిలో వికెట్లు ఉండడం అవసరం. ఐస్ కూల్ (ఒత్తిడి లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉండడం)గా ఉండడంలో ఎంఎస్ ధోనీ మాదిరే దినేష్ కార్తీక్ కూడా’’ అని డూప్లెసిస్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. దినేష్ కార్తీక్ ను ఆర్డర్ లో వెనుక పంపించడాన్ని సమర్థించుకున్నాడు. కార్తీక్ కేవలం 14 బంతుల్లో 32 పరుగులు రాబట్టడం తెలిసిందే. 

‘‘ఎంతో సంతోషంగా ఉంది. చాలా తక్కువ వ్యత్యాసంతో ఉండే మ్యాచ్ లలో ఆరంభం ఎంతో కీలకం. సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నించాం. కానీ, ప్రత్యర్థి సీమర్ల బౌలింగ్ చక్కగా కొనసాగింది. టీమ్ లో మంచి సంబంధాలు ఉన్నాయి. వారి నుంచి ఎంతో సహకారం లభిస్తోంది’’ అని డూప్లెసిస్ వివరించాడు. లక్ష్యం చాలా చిన్నదే అయినా.. కేకేఆర్ చక్కని బౌలింగ్ తో విజయం కోసం ఆర్సీబీ చివరి ఓవర్ వరకు పోరాడాల్సి వచ్చింది.


More Telugu News