వచ్చే ఎన్నికల్లో వైసీపీ మరిన్ని సీట్లు గెలుచుకుంటుంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

  • చంద్రబాబు హైదరాబాదులో కూర్చొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు
  • వైసీపీ పాలన టీడీపీకి సైకో పాలనలా కనిపిస్తోంది
  • ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయన్న పెద్దిరెడ్డి 
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. హైదరాబాదులో కూర్చొని ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలను, 23 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారని... రాబోయే ఎన్నికల్లో ఇంతకు మించిన విజయాన్ని అందించబోతున్నారని అన్నారు. 

జగన్ పాలన ప్రజలందరికీ సంక్షేమ పాలనగా కనిపిస్తోందని... కానీ, టీడీపీకి మాత్రం సైకో పాలనలా కనిపిస్తోందని పెద్దిరెడ్డి విమర్శించారు. అసలు రాష్ట్రంలో ఇంతకుముందు 14 సంవత్సరాల పాటు సైకో పాలన సాగిందని దెప్పిపొడిచారు. డబ్బులతో ఎన్నికలకు వెళ్లే సంస్కృతి టీడీపీదని... ఇలాంటి సంస్కృతి వైసీపీలో లేదని చెప్పారు. చంద్రబాబు బినామీలందరూ చందాలు వేసుకుని టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. 

ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని చెప్పారు. ఏ కుటుంబం ఆర్థికంగా చితికిపోకూడదన్న ఉద్దేశంతో సీఎం జగన్ అందర్నీ ఆదుకుంటున్నారని పెద్దిరెడ్డి చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అమ్మఒడి, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేశారని తెలిపారు. 14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.


More Telugu News