తెలుగు సినీ హబ్ గా కర్నూలు... ప్రముఖ నిర్మాత ప్రతిపాదన

  • సినీ రంగానికి ఏపీ సర్కారు చేయూతనిస్తోందన్న కేఎస్ రామారావు
  • కర్నూలులో చిత్రీకరణకు తగిన ప్రదేశాలున్నాయని వెల్లడి
  • రాయితీలు లభిస్తాయని వివరణ
  • ఉగాది తర్వాత ప్రభుత్వ పెద్దలను కలుస్తానని స్పష్టీకరణ
కర్నూలు నగరాన్ని ఏపీ న్యాయ రాజధానిగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, కర్నూలు సినీ హబ్ గానూ అభివృద్ధి చెందేందుకు అన్ని హంగులు కలిగివున్న నగరం అని సీనియర్ నిర్మాత, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ అధినేత కేఎస్ రామారావు అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం విశాఖను సినీ హబ్ గా మలచాలని ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో, కేఎస్ రామారావు తాజా ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది. 

తాజాగా, కేఎస్ రామారావు మాట్లాడుతూ, కర్నూలులో సినిమా షూటింగ్ లకు అనువైన ప్రదేశాలు అనేకం ఉన్నాయని వెల్లడించారు. ప్రధానంగా తుంగభద్ర నది, బాలసాయి పాఠశాల, కేసీ కెనాల్, సమ్మర్ స్టోరేజి ట్యాంక్ తదితర ప్రదేశాలు సినిమా షూటింగ్ లకు తగిన ప్రదేశాలు అని కేఎస్ రామారావు వివరించారు. ఇక్కడ 12 ఎకరాల్లో ఫిలింసిటీ కూడా అభివృద్ధి చేయొచ్చని అన్నారు. ఏపీలో షూటింగులు చేస్తే రాయితీలు ఉన్నందున ఇకపై కర్నూలు పరిసరాల్లో సినిమాలు తీస్తామని చెప్పారు.

కర్నూలులో చిత్రీకరణలు, ఫిలిం క్లబ్ ఏర్పాటుపై టాలీవుడ్ పెద్దలు ఆలోచించాలని అన్నారు. ఉగాది తర్వాత ఈ అంశాలతో ఏపీ ప్రభుత్వ పెద్దలను కలుస్తానని, సినీ ప్రముఖులతోనూ మాట్లాడతానని కేఎస్ రామారావు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం చిన్న, పెద్ద సినిమాలకు అండగా నిలుస్తోందని తెలిపారు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా సీఎం జగన్ ఎంతో సహకరించారని వెల్లడించారు. 

కర్నూలులో కొండారెడ్డి బురుజు, జిల్లాలోని సంగమేశ్వర ఆలయం, నల్లమల అడవుల్లో ఇప్పటికే అనేక టాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకోవడం తెలిసిందే.


More Telugu News