36 వేల ముక్కలైన చైనా విమానం.. ప్రమాదంపై విస్తుపోయే విషయాలు!

  • రెండు బ్లాక్ బాక్సులను స్వాధీనం చేసుకున్న అధికారులు
  • ఇప్పటిదాకా 3.7 లక్షల మీటర్ల మేర గాలింపు
  • మరిన్ని విమానశకలాల కోసం ముమ్మరంగా వెతుకులాట
  • భూమి లోపలా గాలింపునకు ఎక్స్ కవేటర్ల తరలింపు
చైనా విమాన ప్రమాదంలో విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. వారం క్రితం 132 మందితో బయల్దేరిన విమానం కాసేపటికే గుట్టల్లో నిట్టనిలువునా కూలిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో విమానంలోని అందరూ చనిపోయారు. 28 ఏళ్లలో ఇదే అత్యంత భారీ విమాన ప్రమాదమని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఆ విమానానికి సంబంధించిన రెండు బ్లాక్ బాక్స్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

విమానం కూలిపోయినప్పుడు విమానం కొన్ని వేల ముక్కలైందని, అందులో ఇప్పటిదాకా 36 వేల ముక్కలను స్వాధీనం చేసుకున్నామని చైనా పౌర విమానయాన నియంత్రణ సంస్థ అధిపతి ఝూ టావో చెప్పారు. బ్లాక్ బాక్సుల సమాచారం ఆధారంగా తమ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారని, విమాన శకలాల కోసం గాలింపు సాగుతోందని ఆయన తెలిపారు. 

ప్రస్తుతం 15 వేల మంది సహాయ సిబ్బంది విమాన శకలాల కోసం గాలింపు చేస్తున్నారని గ్వాంగ్షీ ఫైర్ అండ్ రెస్క్యూ కోర్ అధిపతి ఝెంగ్ షీ పేర్కొన్నారు. ఇప్పటిదాకా 3.7 లక్షల చదరపు మీటర్ల మేర గాలింపు సాగించారని, 36 వేల శకలాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. విమానశకలాలు భూమి లోపలికి ఏమైనా దూసుకుపోయాయా? అన్న కోణంలోనూ వెతుకులాట చేస్తున్నామని, అందుకోసం చాలా లోతు వరకు తవ్వేందుకు ఎక్స్ కవేటర్లను తీసుకెళుతున్నామని ఆయన వెల్లడించారు.


More Telugu News