అంద‌ర‌మూ ఏకం కావాలి.. సమావేశం అవుదాం: ఎన్డీయేత‌ర పార్టీల‌కు మ‌మ‌తా బెన‌ర్జీ లేఖ‌

  • దేశ ప్ర‌జాస్వామ్యంపై బీజేపీ దాడి చేస్తోంది
  • కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడదాం
  • ప్ర‌జ‌లు కోరుకునే ప్రభుత్వం ఏర్పడే దిశగా అడుగులు వేయాలన్న మ‌మ‌తా బెన‌ర్జీ
దేశ ప్ర‌జాస్వామ్యంపై బీజేపీ దాడి చేస్తోందని, ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకమవ్వాలని ఎన్డీయేత‌ర‌ ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ప‌శ్చిమ‌ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. బీజేపీపై పోరాడ‌డానికి వ్యూహాలపై చర్చించడానికి సమావేశం అవుదామ‌ని ఆమె పిలుపునిచ్చారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఐక్యత సాధించాల‌ని, దేశ ప్ర‌జ‌లు కోరుకునే ప్రభుత్వం ఏర్పడే దిశగా అడుగులు వేయాల‌ని ఆమె అన్నారు. 

కేంద్ర ప్ర‌భుత్వం దేశంలో అణచివేత ధోర‌ణితో పాలన కొన‌సాగిస్తోంద‌ని, దానిపై పోరాడేందుకు ప్రగతిశీల శక్తులన్నీ చేతులు కలపాలని ఆమె అన్నారు. సంస్థాగత ప్రజాస్వామ్య విలువలపై బీజేపీ దాడులు చేస్తోందని విమర్శించారు. బీజేపీ తీరుపై ఆందోళన వ్యక్తం చేసేందుకే తాను ప్ర‌తిప‌క్ష పార్టీలకు ఈ లేఖ రాస్తున్నాన‌ని అన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై ప్ర‌తీకారం తీర్చుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సీబీఐ, ఈడీ, సీవీసీ, ఆదాయ ప‌న్ను శాఖ‌ వంటి సంస్థలను వాడుకుంటోంద‌ని ఆమె ఆరోప‌ణ‌లు గుప్పించారు.


More Telugu News