బ్యాంకులో వృద్ధుడు ఉన్నాడని గుర్తించకుండా తాళం వేసి వెళ్లిన సిబ్బంది.. 18 గంటలు ఇబ్బందిపడ్డ వృద్ధుడు

  • నిన్న సాయంత్రం 4.20 గంట‌ల‌ నుంచి బ్యాంకులో వృద్ధుడు
  • నేటి ఉదయం 10 గంటలకు బయటకు..
  • హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఘటన
  • వృద్ధుడికి మధుమేహం, బీపీ
బ్యాంకులో లాక‌ర్ గ‌దిలో ఓ వృద్ధుడు ఉన్నాడ‌న్న విష‌యాన్ని కూడా గుర్తించ‌కుండా బ‌య‌టి నుంచి తాళం వేసి వెళ్లిపోయారు సిబ్బంది. దీంతో ఆయ‌న దాదాపు 18 గంట‌ల పాటు బ్యాంకులోనే ఉండిపోవాల్సి వ‌చ్చింది. హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌లోని యూనియన్ బ్యాంకులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం 4.20 గంట‌ల‌కు కృష్ణారెడ్డి (87) బ్యాంకుకు వెళ్లారు. ఆయ‌న బ్యాంకులోని లాకర్ గదిలో ఉన్న విష‌యాన్ని బ్యాంకు సిబ్బంది గ‌మ‌నించ‌లేదు. 

బ్యాంకు ప‌ని వేళ‌లు ముగియ‌డంతో దానికి తాళం వేసి వెళ్లిపోయారు. బ్యాంకులో నుంచి బ‌య‌ట‌కు రాలేక కృష్ణారెడ్డి అందులోనే ఉండిపోయారు. ఆయ‌న వ‌ద్ద సెల్‌ఫోన్ కూడా లేన‌ట్లు తెలుస్తోంది. చీకటిపడినప్ప‌టికీ ఆయ‌న‌ ఇంటికి రాకపోవడంతో కుటుంబ స‌భ్యులు స్థానిక పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీసీ కెమెరాలు చూడ‌గా, కృష్ణారెడ్డి బ్యాంకులోనే ఉండిపోయిన‌ట్లు గుర్తించారు. 

ఈరోజు ఉదయం 10 గంటలకు బ్యాంకు లాకర్ నుంచి ఆ వృద్ధుడిని పోలీసులు బయటకు తీసుకు వ‌చ్చారు. కృష్ణారెడ్డి మ‌ధుమేహం, బీపీతో బాధ‌ప‌డుతున్నార‌ని కుటుంబ స‌భ్యులు చెప్పారు. ఆయ‌న‌ను వెంట‌నే ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. బ్యాంకు సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినందుకు కృష్ణారెడ్డి కుటుంబ స‌భ్యులు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.  



More Telugu News