డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడి.. కోర్టు ఆదేశాలతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తోన్న యువకుడు

  • ఐదు రోజుల పాటు ట్రాఫిక్ విధులు
  • ప్ర‌స్తుతం ఉప్పల్‌ రింగురోడ్డులో విధుల్లో బిజీ
  • మందుబాబుకు రూ.3 వేల జ‌రిమానా కూడా..
డ్రంకెన్ డ్రైవ్ చేయకూడదంటూ పోలీసులు ఎంతగా చెబుతున్నప్పటికీ కొందరు మందుబాబులు వినిపించుకోవ‌ట్లేదు. మ‌ద్యం తాగి వాహనాలు న‌డుపుతూ ఎదుటి వారి జీవితాల‌నూ ప్ర‌మాదంలో ప‌డేస్తున్నారు. దీంతో డ్రంకెన్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డిన వారికి బుద్ధి వ‌చ్చేలా తాజాగా ఒక‌రికి ట్రాఫిక్ విధులు నిర్వ‌హించాలంటూ కోర్టు శిక్ష విధించింది. ఐదు రోజుల పాటు ఆ బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డంతో పాటు ఆ మందుబాబు రూ.3 వేల జ‌రిమానా కూడా చెల్లించాల‌ని కోర్టు ఆదేశించింది. 

ఇటీవ‌ల‌ తన్నీరు ఏసుబాబు అనే యువకుడు మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లా మేడిపల్లి కమాన్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అత‌డిని పోలీసులు ఎల్బీనగర్‌ కోర్టులో హాజ‌రుప‌ర్చారు. కోర్టు విధించిన శిక్ష ప్ర‌కారం.. ట్రాఫిక్‌ పోలీసులు ఆ యువకుడిని ప్ర‌స్తుతం ఉప్పల్‌ రింగురోడ్డులో ట్రాఫిక్‌ విధుల్లో నియమించారు. దీంతో ఏసుబాబు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద నిలబడి, వాహనాలు నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌కుండా చూసుకుంటూ బిజీగా ఉన్నాడు.


More Telugu News