రాహుల్ గాంధీకి టీఆర్ఎస్ కవిత కౌంటర్.. మండిపడిన రేవంత్ రెడ్డి

  • ధాన్యం కొనుగోళ్లపై రాహుల్ స్పందన
  • బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతుల శ్రమతో రాజకీయం చేస్తున్నాయంటూ మండిపాటు
  • ట్విట్టర్ సంఘీభావం మాని టీఆర్ఎస్ ఎంపీలతో పాటు నిరసన తెలపాలన్న కవిత
  • టీఆర్ఎస్ ఎంపీలది పోరాటం కాదు.. కాలక్షేపమన్న రేవంత్ 
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై రాహుల్ అసహనం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. కవిత వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.  

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయని, రైతుల శ్రమతో రాజకీయం చేస్తున్నాయని రాహుల్ మండిపడ్డారు. అన్నం పెట్టే రైతులను క్షోభపెట్టే పనులను మానుకోవాలని, రైతు వ్యతిరేక విధానాలను విడనాడి ప్రతి గింజా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో పండిన చివరి గింజదాకా కొనేవరకు రైతుల తరఫున పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. 

ఆ వ్యాఖ్యలకు బదులిచ్చిన కవిత.. రాజకీయ లబ్ధి కోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం తెలుపడం కాదని, ధాన్యం కొనుగోళ్లపై అంత నిజాయతీనే ఉంటే పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలకు మద్దతిచ్చేలా వెల్ లోకి వచ్చి నిరసన తెలియజేయాలని సూచించారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదంటూ టీఆర్ఎస్ ఎంపీలు రోజూ పార్లమెంట్ వెల్ లో నిరసన చేస్తున్నారన్నారు. ఒక దేశం, ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయాలని రాహుల్ కు సూచించారు. 

ఆమె వ్యాఖ్యలకు రేవంత్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదని, సెంట్రల్ హాల్ లో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ఎఫ్ సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమంటూ 2021 ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందంపై సంతకం చేసివ్వలేదా? అని ప్రశ్నించారు. తద్వారా రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరేనన్న విషయాన్ని మరచిపోయారా? అంటూ నిలదీశారు.


More Telugu News