సినిమా చూసి బౌండరీల వర్షం కురిపించిన పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు

  • గత రాత్రి పంజాబ్, బెంగళూరు మ్యాచ్
  • 206 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించిన పంజాబ్
  • ఆటగాళ్లకు 14 పీక్స్ సినిమా చూపించిన కోచ్ కుంబ్లే
  • స్ఫూర్తిదాయక చిత్రమని ప్రశంసించిన ఆటగాళ్లు
ఐపీఎల్ 15వ సీజన్ లో ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగుతుండడంతో అభిమానులకు సిసలైన క్రికెట్ విందు లభిస్తోంది. నిన్న ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఉల్లాసభరితంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 205 పరుగులు చేయగా, పంజాబ్ జట్టు విధ్వంసక ఆటతీరుతో లక్ష్యాన్ని ఛేదించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో పంజాబ్ జట్టు ఇలాంటి పరిస్థితుల్లో చేతులెత్తేసిన ఘటనలే అత్యధికం. 

అయితే, ఈసారి సరికొత్త పంజాబ్ కనిపించింది. బరిలో దిగిన ప్రతి ఆటగాడు బంతిపై ఆకలిగొన్న పులిలా విజృంభించాడు. పంజాబ్ ఆటగాళ్లలో ఈమేరకు స్ఫూర్తి రగిలించిన వ్యక్తి కోచ్ అనిల్ కుంబ్లే. మ్యాచ్ కు ముందు ఆటగాళ్లకు '14 పీక్స్' అనే నేపాలీ ఆంగ్ల చిత్రం చూపించాడు. ఆటగాళ్ల కోసమే ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఎవరెస్ట్ శిఖరం సహా 14 సంక్లిష్టమైన శిఖరాలను కేవలం 7 నెలల్లోనే అధిరోహించడం ఈ సినిమాలో చూడొచ్చు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యసాధనే ముఖ్యమని ఈ చిత్రం ద్వారా సందేశం అందించారు. ఏదీ అసాధ్యం కాదు అనేది ఈ చిత్రం ట్యాగ్ లైన్.

ఈ సినిమా తమను ఎంతగానో ఆకట్టుకుందని పంజాబ్ ఆటగాడు ఓడియన్ స్మిత్ వెల్లడించాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఓడియన్ స్మిత్ ఈ మ్యాచ్ లో కేవలం 8 బంతుల్లోనే 25 పరుగులు చేసి జట్టు విజయంలో ముఖ్యభూమిక పోషించాడు. అతడి స్కోరులో 1 ఫోర్, 3 భారీ సిక్సులున్నాయి. నిన్నటి మ్యాచ్ లో స్మిత్ తో పాటు పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (32) నుంచి ధావన్ (43), భానుక రాజపక్స (43), షారుఖ్ ఖాన్ (24) వరకు అందరూ బ్యాట్లు ఝళిపించడంతో మరో ఓవర్ మిగిలుండగానే పంజాబ్ కింగ్స్ జయభేరి మోగించింది.


More Telugu News