కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లాలకు పద్మ భూషణ్ అవార్డు ప్రదానం
- కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు పద్మ భూషణ్
- రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న ఎల్లా దంపతులు
- యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్‌కు పద్మ విభూషణ్ అవార్డు
పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం రాష్ట్రపతి భవన్‌లో వేడుకగా జరిగింది. ఇప్పటికే ఓ దఫా పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగగా..తాజాగా సోమవారం మరికొందరికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొన్న భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్లా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు. కరోనాకు దేశంలో రెండు వ్యాక్సిన్‌లు అభివృద్ధి కాగా.. వాటిలో కొవాగ్జిన్ పేరిట రూపొందిన వ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ఇందుకు గానూ ఆ సంస్థ ఎండీ కృష్ణ ఎల్లా, జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్లాలకు పద్మ భూషణ్ అవార్డులను ప్రకటిస్తూ కేంద్రం ఇదివరకే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లాలు అవార్డులను స్వీకరించారు.ఇదిలా ఉంటే.. బీజేపీ దివంగత నేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్‌కు ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డును ఆయన కుమారుడు అందుకున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన మరికొందరికి కూడా ఈ వేడుకలో రాష్ట్రపతి పద్మ అవార్డులను అందజేశారు.