తెలంగాణలో రానున్న ఐదు రోజులు భగభగలే!
- ఇప్పటికే ఠారెత్తిస్తున్న ఎండలు
- పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
- 3 డిగ్రీల వరకు వేడిమి పెరగొచ్చన్న వాతావరణ కేంద్రం
- మూడ్రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం
మార్చి చివరి వారంలోనే సూర్యుడి ప్రతాపం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే పలు చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా నివేదిక విడుదల చేసింది. రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రెండు డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అంతేకాకుండా, రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది.