తల వెంట్రుకలకు రంగు వేసుకోవద్దన్న ఉపాధ్యాయులు.. చంపుతానంటూ గాజు సీసాతో వెంబడించిన విద్యార్థి

  • తమిళనాడులోని సేలం జిల్లాలో ఘటన
  • విద్యార్థిపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయులు
  • గాజు సీసా పట్టుకొచ్చి పొడిచేస్తానని బెదిరించిన విద్యార్థి
  • భయపడి క్లాసు రూములోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఉపాధ్యాయులు
తల వెంట్రుకలకు రంగు వేసుకోవడం మంచిది కాదంటూ హితవు పలికిన పాపానికి ఉపాధ్యాయులనే చంపాలని చూశాడో ప్రబుద్ధుడు. తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని అత్తూర్ ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి తలకి రంగు వేసుకుని స్కూలుకొచ్చాడు. అది చూసిన హెడ్మాస్టర్, ఇతర ఉపాధ్యాయులు అతడిని మందలించారు. తల వెంట్రుకలకు రంగు వేసుకుని స్కూలుకు రావడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. 

ఉపాధ్యాయుల మాటలను లక్ష్యపెట్టని విద్యార్థి వారితో అనుచితంగా మాట్లాడాడు. దీంతో అతడి తల్లిదండ్రులను స్కూలుకు పిలిపించిన ఉపాధ్యాయులు విషయం చెప్పారు. అక్కడితో ఆ విషయం ముగిసిపోగా, శనివారం గాజు సీసాతో స్కూలుకొచ్చిన సదరు విద్యార్థి ఉపాధ్యాయులను పొడిచేస్తానంటూ వెంబడించాడు. దీంతో భయపడిన వారు ఓ క్లాస్ రూములోకి వెళ్లి తలుపులు వేసుకుని దాక్కున్నారు. విషయం తెలిసిన పోలీసులు స్కూలుకు చేరుకుని విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చారు.


More Telugu News