ఆ పని చేస్తే బీఎస్పీ ఖేల్ ఖతమైనట్టే: అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు

  • యూపీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించిన బీఎస్పీ   
  • రాష్ట్రపతి అంశం తన కలలో కూడా లేదని స్పష్టీకరణ
  • ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేశాయని ఆరోపణ
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనున్న నేపథ్యంలో మాయావతిని రాష్ట్రపతిని చేసేందుకు రంగం సిద్ధమైందంటూ వచ్చిన వార్తలపై బీఎస్పీ అధినేత్రి స్పందించారు. రాష్ట్రపతి పదవి అనేది తన కలలో కూడా లేని అంశమని తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ ఘోర పరాజయంపై సమీక్ష నిర్వహించిన మాయావతి.. రాష్ట్రపతి పదవి వార్తలపై స్పందించారు. తాను ఒకవేళ రాష్ట్రపతి పదవిని అంగీకరిస్తే అక్కడితో పార్టీ అంతమైనట్టేనని అన్నారు. బీజేపీ సహా ఏ పార్టీ ఆఫర్ చేసినా రాష్ట్రపతి పదవిని అంగీకరించబోనన్నారు. 

పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం కూడా అత్యున్నత పదవిని తిరస్కరించారని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్ కలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేశాయని ఆరోపించారు. యూపీలో బీఎస్పీ ప్రభుత్వం ఏర్పడకపోతే బెహన్‌జీ (మాయావతి)ని రాష్ట్రపతిని చేస్తామని వారు ప్రచారం చేశారని, దీంతో ప్రజలు బీజేపీకి అధికారం కట్టబెట్టారని విమర్శించారు. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మాయావతి పేర్కొన్నారు. కాగా, ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను బీఎస్పీ కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది.


More Telugu News