స్విస్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న పీవీ సింధు... కేంద్రమంత్రుల అభినందనలు

  • స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో టోర్నీ
  • నేడు ఫైనల్లో థాయ్ షట్లర్ బుసానెన్ పై విజయం
  • వరుస గేముల్లో 49 నిమిషాల్లోనే నెగ్గిన సింధు
  • ఈ సీజన్ లో రెండో సింగిల్స్ టైటిల్
తెలుగుతేజం పీవీ సింధు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి మెరిసింది. స్విస్ ఓపెన్ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో ఇవాళ జరిగిన స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో సింధు 21-16, 21-8తో థాయ్ లాండ్ కు చెందిన బుసానెన్ పై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ ను సింధు 49 నిమిషాల్లోనే ముగించింది. 

తొలి గేములో కాస్త ప్రతిఘటించిన బుసానెన్... రెండో గేములో సింధు దూకుడుకు తలవంచింది. ఇప్పటివరకు బుసానెన్ తో 17 సార్లు తలపడిన సింధుకు ఇది 16వ విజయం అంటే, థాయ్ షట్లర్ పై ఆమె ఆధిపత్యం ఎలా ఉందో అర్థమవుతోంది. సింధు ఈ టోర్నీలో గతేడాది రన్నరప్ తో సరిపెట్టుకుంది. నాడు జరిగిన ఫైనల్లో రియో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ కరోలినా మారిన్ చేతిలో ఓడింది. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడి టైటిల్ ను ఎగరేసుకెళ్లింది. 

కాగా, ఈ సీజన్ లో సింధుకు ఇది రెండో సింగిల్స్ టైటిల్. స్విస్ ఓపెనర్ లో అద్భుత ఆటతీరు కనబర్చిన సింధును కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి అభినందించారు. సింధు కీర్తికిరీటంలో మరో ఘనత చేరిందని కిషన్ రెడ్డి కొనియాడారు.


More Telugu News