నత్తి సమస్యను అధిగమించేందుకు బైడెన్ వేగంగా మాట్లాడతారు.. పుతిన్ ను దించేసే ఉద్దేశం లేదంటూ అమెరికా వివరణ

  • పుతిన్ కు అధ్యక్షుడిగా ఉండే అర్హత లేదంటూ నిన్న బైడెన్ వ్యాఖ్యలు
  • దౌత్యవర్గాల్లో చర్చకు దారితీసిన వైనం
  • అది నిర్ణయించేది బైడెన్ కాదు.. రష్యా ప్రజలన్న రష్యా
  • తాజాగా వివరణ ఇచ్చిన అమెరికా
రష్యా అధ్యక్షుడిగా ఉండే అర్హత వ్లాదిమిర్ పుతిన్ కు లేదంటూ నిన్న పోలెండ్ లో ప్రసంగం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలు ప్రపంచ దేశాల్లో చర్చకు దారి తీశాయి. దుమారాన్నీ రేపాయి. 

రష్యా అధ్యక్షుడిని పదవిలో నుంచి దింపేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందంటూ దౌత్యవర్గాల్లో చర్చ మొదలైంది. పుతిన్ ను దించేసేందుకు ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతోందంటూ వాదనలు మిన్నంటాయి. రష్యా కూడా వెంటనే దానిపై ఘాటుగానే బదులిచ్చింది. రష్యా అధ్యక్షుడిని దింపేసే అధికారం బైడెన్ కు లేదని, రష్యా ప్రజలే పుతిన్ ను ఎన్నుకున్నారని, వారికే అధికారం ఉంటుందని ప్రకటించింది. 

అయితే, తాజాగా బైడెన్ వ్యాఖ్యలపై అమెరికా శ్వేత సౌధ అధికారులు వివరణ ఇచ్చారు. పుతిన్ ను దింపేసే ఉద్దేశం బైడెన్ కు లేదని, ఆయన వ్యాఖ్యలకు అర్థం అది కాదని స్పష్టం చేశారు. పొరుగు దేశాలపై అధికారం చెలాయించే హక్కు పుతిన్ కు లేదన్నది మాత్రమే బైడెన్ ఉద్దేశమని వివరణ ఇచ్చారు. 

అప్పుడప్పుడు బైడెన్ నోటి నుంచి పొరపాటున అలాంటి పదాలు వస్తుంటాయని, నత్తి సమస్య నుంచి బయటపడేందుకు అధ్యక్షుడు చాలా వేగంగా మాట్లాడుతుంటారని, ఆ క్రమంలోనే పొరపడి ఉంటారని చెప్పారు. అయితే, బైడెన్ పొరపాటున ఆ వ్యాఖ్యలు చేసినా పుతిన్ ను రెచ్చగొట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.


More Telugu News