అందుకే మేము ప్ర‌యాణిస్తోన్న‌ బ‌స్సు బాకరాపేటలో లోయలో ప‌డింది: పెళ్లి కొడుకు వేణు

  • మెల్లిగా వెళ్లాల‌ని డ్రైవ‌ర్‌కు చెప్పాం
  • డ్రైవ‌ర్ వినిపించుకోకుండా వేగంగా బ‌స్సు న‌డిపాడు
  • ఎదురుగా వాహ‌నాలు వ‌స్తున్న‌ప్ప‌టికీ వేగంగా తీసుకెళ్లాడు
  • బ‌స్సు ఒక్క‌సారిగా లోయ‌లో ప‌డిపోయింది
చిత్తూరు జిల్లా బాకరాపేటలో గ‌త రాత్రి 'కేఎల్ 30 ఏ 4995' నంబ‌రు గ‌ల బ‌స్సు లోయ‌లో ప‌డి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో పెళ్లి కొడుకు వేణు స‌హా 52 మంది బ‌స్సులో ఉన్నారు. పెళ్లికొడుకుకు కూడా గాయాల‌య్యాయి. ఆసుప‌త్రిలో బెడ్ పై నుంచి ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ ప్ర‌మాదానికి సంబంధించిన ప‌లు వివ‌రాలు తెలిపాడు. తాము మెల్లిగా వెళ్లాల‌ని చెప్పిన‌ప్ప‌టికీ డ్రైవ‌ర్ వినిపించుకోకుండా వేగంగా బ‌స్సు న‌డిపాడ‌ని అన్నాడు. ఎదురుగా వాహ‌నాలు వ‌స్తున్న‌ప్ప‌టికీ వేగంగా తీసుకెళ్లి, వాటిని త‌ప్పించే క్ర‌మంలో డ్రైవ‌ర్ బ‌స్సుపై నియంత్రణ కోల్పోయాడ‌ని, ఒక్క‌సారిగా బ‌స్సు లోయ‌లో ప‌డిపోయింద‌ని చెప్పాడు. 

ఆ త‌ర్వాత తాము అంద‌రం గాయాల‌పాలై స్పృహ కోల్పోయామ‌ని అన్నాడు. మ‌ళ్లీ మెలుకువ వ‌చ్చే స‌రికి ఆసుప‌త్రిలో ఉన్నామ‌ని, త‌మ‌ను పోలీసులు ఇక్క‌డ‌కు తీసుకొచ్చిన‌ట్లు తెలిసింద‌ని చెప్పాడు. ప్ర‌మాదానికి ముందు తాను బ‌స్సులో వెనుక సీట్లో కూర్చొని ఉన్నాన‌ని చెప్పాడు. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ వారు అంద‌రూ త‌మ బంధువులు, మిత్రులేన‌ని తెలిపాడు. మ‌రో 20 నిమిషాల్లో తిరుప‌తికి చేరుకుంటామ‌న‌గా బాకరాపేటలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని వివ‌రించాడు.


More Telugu News