కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఆ మాట అనుంటే ఆయనను మేమే నిలదీసే వాళ్లం: బండి సంజయ్

  • పియూష్ గోయల్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం
  • నూకలు తినాలని గోయల్ అనలేదన్న బండి సంజయ్
  • టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడి
  • రైతులతో కేసీఆర్ రాజకీయ క్రీడ ఆడుతున్నారని విమర్శలు
ధాన్యం కొనుగోలు అంశంలో తెలంగాణ అధికార పక్షం టీఆర్ఎస్ కు, బీజేపీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల టీఆర్ఎస్ నేతలు మండిపడుతుండగా, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్రమంత్రి పియూష్ గోయల్ అనలేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. 

ఒకవేళ తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్రమంత్రి పియూష్ గోయల్ అనుంటే ఆయనను తామే నిలదీసేవాళ్లమని స్పష్టం చేశారు. రైతులంటే పియూష్ గోయల్ కు ఎంతో గౌరవం అని అన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత తెలంగాణ మంత్రులు కొత్త నాటకాలకు తెరలేపారని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీల పెంపు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 

అబద్ధాలు ఆడుతూ, సెంటిమెంట్ రగల్చడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని వ్యంగ్యం ప్రదర్శించారు. కేసీఆర్ తన రాజకీయ క్రీడలో రాష్ట్ర రైతులను భాగం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ వైఖరి వల్లే ధాన్యం కొనుగోలు అంశం సంక్లిష్టంగా మారిందని ఆరోపించారు.


More Telugu News