ధోనీ అంతే... ఎలాంటి మొహమాటం ఉండదు!

  • గతంలో పూణే జట్టుకు ఆడిన ధోనీ
  • పూణే జట్టు డేటా అనలిస్టుగా పనిచేసిన అగోరమ్
  • ధోనీతో సంభాషణను వెల్లడించిన అగోరమ్
  • అడిగేంత వరకు సలహాలు ఇవ్వొద్దన్నాడని వెల్లడి 
క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఆట పరంగా ఎన్నో విజయాలు, ఎన్నో ఘనతలు సొంతం చేసుకుని, ఆదాయంలోనూ మేటిగా ఉన్న ధోనీపై వివాదాలు చాలా తక్కువ. ధోనీ ఎంతో ముక్కుసూటి వ్యక్తి. తన మనసులో ఉన్నది ఎదుటివాళ్లకు స్పష్టంగా తెలియజేస్తాడు. ధోనీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేందుకు ఓ స్పోర్ట్స్ డేటా అనలిస్టు వెల్లడించిన సంగతే నిదర్శనం. ధోనీ ఐపీఎల్ లో చెన్నై జట్టుకు కాకుండా మరో జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. అవినీతి ఆరోపణలతో చెన్నై జట్టు రెండేళ్లు నిషేధానికి గురికాగా, రైజింగ్ పూణే సూపర్ జెయింట్ జట్టుకు ఆడాడు. 

ఆ సమయంలో ప్రసన్న అగోరమ్ పూణే జట్టుకు డేటా అనలిస్టుగా వచ్చాడు. అప్పుడు ఏంజరిగిందో ప్రసన్న అగరోమ్ తన తాజా కాలమ్ లో వివరించాడు. 

"2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్ కు సేవలు అందించే అవకాశం వచ్చింది. జట్టుతో చేరిన తర్వాత ఓ రోజు ధోనీని కలిశాను. మనం కాసేపు మాట్లాడుకుందాం అంటూ ధోనీ ఫిల్టర్ కాఫీ ఆఫర్ చేశాడు. నేను తాగుతానని చెప్పేసరికి కుర్రాళ్లను పిలిచి కాఫీ తెమ్మని చెప్పాడు. ఆ తర్వాత కాఫీ తాగుతూ మా సంభాషణ కొనసాగించాం. 

అప్పుడు ధోనీ నాతో ఏం చెప్పాడంటే... మీకు ఈ రంగంలో ఎంతో అనుభవం ఉందని విన్నాను. జట్టులోని ఆటగాళ్లు కూడా మీ పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. అందుకే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మిమ్మల్ని ఎంపిక చేశాడు. మీతో కలిసి పనిచేయడం సంతోషంగా భావిస్తున్నాను. ఆటకు సంబంధించి అన్ని వ్యూహాలను కోచ్ తోనూ, ఆటగాళ్లతోనూ పంచుకోండి. కోచ్, ఆటగాళ్లతో వ్యూహాలకు సంబంధించి సమావేశాలు నిర్వహించండి. అయితే, ఆ సమావేశాల్లో నేను కూడా ఉండాలని మాత్రం ఆశించవద్దు... అంతేకాదు, నేను అడిగేంత వరకు నాకు ఎలాంటి సలహాలు ఇవ్వొద్దు. ముఖ్యంగా, కోచ్ తో, ఆటగాళ్లతో మీరు జరిపే ఈమెయిల్ సంభాషణలను కచ్చితంగా భద్రపరచండి.. అని ధోనీ నాతో చెప్పాడు" అంటూ ప్రసన్న అగోరమ్ వివరించాడు.


More Telugu News