సినిమాలు ఉంటాయ్... అక్కడే 'రాజమౌళి సినిమా'లంటూ కూడా ఉంటాయ్!: ఆర్ఆర్ఆర్ పై మహేశ్ బాబు స్పందన

  • నిన్న రిలీజైన ఆర్ఆర్ఆర్
  • ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం
  • సినిమాను వీక్షించిన మహేశ్ బాబు
  • సోషల్ మీడియా వేదికగా మనోభావాలను పంచుకున్న వైనం
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతాఇంతా కాదు. బాక్సాఫీసు కలెక్షన్ల పరంగానే కాదు, ఓ అద్భుత దృశ్యకావ్యం అంటూ ప్రతి ఒక్కరూ వేనోళ్ల కీర్తిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ భారీ చిత్రంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. తన స్పందనను పలు ట్వీట్ల రూపంలో వెలిబుచ్చారు. 

"సినిమాలు ఉంటాయ్... అక్కడే రాజమౌళి సినిమాలంటూ కూడా ఉంటాయ్! ఆర్ఆర్ఆర్ సినిమా ఒక మహోన్నత దృశ్యకావ్యం. ఆ సినిమా భారీతనం, ఘనతర సన్నివేశాలు, సంగీతం, భావోద్వేగాలు ఏమాత్రం ఊహకందనివి. ఊపిరిబిగబట్టేలా చేస్తాయి... ఒక్కమాటలో చెప్పాలంటే మనల్ని కట్టిపడేస్తాయి. ఈ సినిమాలో కొన్ని సీక్వెన్స్ లు చూస్తూ మనల్ని మనం మర్చిపోతాం. ఆర్ఆర్ఆర్ సినిమా అనుభూతిలో మనం కూడా లీనమైపోతాం. 

రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడే ఇలాంటి కథను రక్తి కట్టించగలడు. రాజమౌళి సంచలనాత్మక రీతిలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంతో గర్విస్తున్నాం సర్! ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ ల గురించి చెపాల్సి వస్తే వారు తమ స్టార్ డమ్ ను మించిపోయారు. వారి నటనా ప్రతిభ ప్రపంచం హద్దులు దాటింది. 'నాటు నాటు' పాట చూస్తే భూమ్యాకర్షణ సిద్ధాంతం వట్టిదే అనిపించేలా వారి పెర్ఫార్మెన్స్ ఉంది. సరిగ్గా చెప్పాలంటే వారు గాల్లో తేలిపోతున్నట్టుగా డ్యాన్స్ చేశారు. 

ఆర్ఆర్ఆర్ వంటి బృహత్తర చిత్రరాజాన్ని అందించిన యావత్ చిత్రబృందానికి ఈ సందర్భంగా హ్యాట్సాఫ్ చెబుతున్నాను. చాలా చాలా గర్విస్తున్నాను... కంగ్రాచ్యులేషన్స్" అంటూ మహేశ్ బాబు  తన మనోభావాలను పంచుకున్నారు.


More Telugu News