ప్రధాని నరేంద్ర మోదీ గత జీవిత విశేషాలతో స్పెషల్ వెబ్ సైట్

  • ‘మోదీ స్టోరీ’ పేరుతో రూపకల్పన
  • తయారు చేసిన వాలంటీర్ గ్రూప్
  • గత కాలపు జ్ఞాపకాలతో సైట్
ప్రధాని నరేంద్ర మోదీ జీవిత విశేషాలతో కొందరు నెటిజన్లు ఓ ప్రత్యేకమైన వెబ్ సైట్ నే తీసుకొచ్చారు. ఆయన్ను దగ్గర్నుంచి చూసిన సన్నిహితులు చెప్పిన వివరాల ఆధారంగా modistory.in అనే సైట్ ను స్టార్ట్ చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ తన జీవితంలో అత్యంత ఆరాధించిన వ్యక్తులు, ఆయన రాసిన ఉత్తరాలు, వ్యక్తిగత జ్ఞాపికలకు సంబంధించిన వివరాలను అందులో పొందుపరిచారు. దానికి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, అనురాగ్ ఠాకూర్ లు వెల్లడించారు. 

'ఎవరికీ తెలియని, ఎవరూ వినని, చూడని ప్రధాని నరేంద్ర మోదీ జీవిత విశేషాలు మీకోసం ఇవిగో..' అంటూ స్మృతీ ఇరానీ ట్వీట్ చేశారు. ఆ వెబ్ సైట్ లింకునూ షేర్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన జీవన గమనానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలతో ఒక స్వచ్ఛంద గ్రూపు వెబ్ సైట్ ను తయారు చేసిందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.  

ప్రధాని గత జీవితం తెలుసుకోవాలనుందా.. అయితే ఇక్కడ క్లిక్ చేయండి

1980ల్లో ఒకానొక సందర్భంలో తాను ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ప్రయాణం చేశానని, ఆ సమయంలో ఎన్నో ఆసక్తికర విషయాలు, గుండెల్ని పిండేసే వివరాలనూ ప్రధాని తనతో పంచుకున్నారని గుజరాత్ కు చెందిన డాక్టర్ అనిల్ రావల్ అనే వ్యక్తి చెప్పారు. 

ఓ సారి తాను మురికివాడల్లో మట్టిగోడలు, రేకులు వేసుకుని ఉంటున్న ఓ స్వయం సేవక్ ఇంటికి వెళ్లినప్పుడు జరిగిన ఘటనను ప్రధాని చెప్పారని తెలిపారు. ‘‘ఆ ఇంటి వాళ్లు భోజనం వడ్డించారు. రొట్టె, కూరతో పాటు పాలిచ్చారు. అయితే, తల్లి ఒడిలో కూర్చున్న  ఆ చిన్నారి పాల వైపే చూస్తున్నాడు. నేను తినేసి.. ఆ పాలను వదిలేసి పైకి లేచి వచ్చేశాను. ఆ తర్వాత పాలను తల్లి బిడ్డకు పట్టేసింది. ఆ ఘటనను చూశాక నా మనసు చలించింది’’అంటూ ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని డాక్టర్ రావల్ గుర్తు చేశారు. 

అలాంటి ఎన్నో విశేషాలతో ఈ వెబ్ సైట్ ను రూపొందించినట్టు రావల్ తెలిపారు.


More Telugu News