రవీంద్ర జడేజా, యూసుఫ్ పఠాన్‌కు షేన్‌వార్న్ విధించిన శిక్షను గుర్తు చేసుకున్న పాక్ మాజీ క్రికెటర్

  • ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన షేన్‌వార్న్
  • అతడితో అనుభవాలను గుర్తుచేసుకుంటున్న క్రికెటర్లు
  • టీం బస్ వద్దకు ఆలస్యంగా వచ్చిన పఠాన్, జడేజా
  • హోటల్ వరకు నడిచి రమ్మని ఆదేశం
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008)లో రాజస్థాన్ రాయల్స్‌కు సారథ్యం వహించాడు. జట్టును అద్భుతంగా నడిపించి తొలి టోర్నీలోనే ట్రోఫీ అందించిపెట్టాడు. అడ్డంకులను అధిగమించి బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఫైనల్‌లో మట్టికరిపించాడు. ఆ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి జట్టుకు టైటిల్ అందించాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు రాజస్థాన్ జట్టుకు ట్రోఫీ అందని ద్రాక్షగానే మారింది.

వార్న్ మరణం తర్వాత అతడితో తమకున్న బంధాన్ని, అనుభవాలను పలువురు క్రికెటర్లు పంచుకున్నారు. 2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడైన పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ తాజాగా వార్న్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్రాక్టీస్, జట్టు సమావేశాలకు ఆలస్యంగా వచ్చే ఆటగాళ్లను వార్న్ ఎలా చూసేవాడన్న విషయాలను గుర్తు చేసుకున్నాడు.

‘‘ఒకసారి యూసుఫ్ పఠాన్, రవీంద్ర జడేజా టీం బస్‌కు కాస్తంత ఆలస్యంగా వచ్చారు. నేను కూడా కొంచెం ఆలస్యంగానే వచ్చాను. అప్పుడు అతడు (వార్న్) ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే జట్టులో నేను కొంత ఆలస్యంగా చేరాను కాబట్టి’’ అని స్పోర్ట్స్ యారీ ‘ట్రిబ్యూట్ టు షేన్‌వార్న్ ఐపీఎల్ డాక్యుమెంటరీ’లో అక్మల్ చెప్పుకొచ్చాడు.  

‘‘ప్రాక్టీస్ ముగిశాక స్టేడియం నుంచి బయలుదేరాం. అప్పుడు వార్నర్ బస్సును ఆపమని డ్రైవర్‌కు చెప్పి.. జడేజా, పఠాన్ వంక చూసి మీరిద్దరూ హోటల్‌కు నడిచి రండి అని చెప్పాడు’’ అని అక్మల్ వివరించాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో వారిద్దరూ నడిచి వచ్చినట్టు చెప్పాడు. కాగా, వార్న్ 2007లో క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు (708) తీసిన రెండో క్రికెటర్‌గా వార్న్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.


More Telugu News