సీఎం జగన్ అసమర్థత వల్లే పోలవరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి ఏర్పడింది: చంద్రబాబు మండిపాటు

  • పోలవరానికి కేంద్రం ఇచ్చే నిధులు తక్కువన్న బాబు 
  • మిగతా రూ.40 వేల కోట్లు ఎవరు భరించాలని ప్రశ్న 
  • పోలవరంపై సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్య 
టీడీపీ 40 వసంతాల లోగో ఆవిష్కరణ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. పోలవరం అంశంపై ఆయన మాట్లాడుతూ... ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలంటూ గతంలో తాము పలుమార్లు ఢిల్లీ వెళ్లామని తెలిపారు. పోలవరానికి కేంద్రం ఇస్తామంటున్న నిధులు చాలా తక్కువని, పోలవరంలో మిగతా రూ.40 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ అసమర్థత వల్లే పోలవరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. 

పోలవరం ప్రాజెక్టు ఖర్చు, ఆర్ అండ్ ఆర్... మొత్తం కేంద్రానిదే బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. తమ హయాంలో ప్రతివారం పోలవరం పనులు సమీక్షించామని తెలిపారు. డయాఫ్రం వాల్ గురించి తెలియకుండానే సీఎం మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలవరంలో డయాఫ్రం వాల్ ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించారు. 2023లో పోలవరం నుంచి నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని నిలదీశారు. పోలవరంపై సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని చంద్రబాబు ఆరోపించారు. 

మద్యం బ్రాండ్ల అంశాన్ని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ఏ మద్యమైనా జగన్ కనుసన్నల్లోనే సరఫరా జరగాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్లు కనిపించడంలేదని అన్నారు. నాటుసారా తాగి 42 మంది చనిపోతే సహజ మరణాలు అంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మద్యం దోపిడీని ప్రజలకు వివరిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. కల్తీ మద్యం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, కల్తీ మద్యం బ్రాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం బ్రాండ్లను అరికట్టే వరకు పోరాటం ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.


More Telugu News