చంద్రబాబు బయట ఉండి వాళ్ల ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారు: అంబటి రాంబాబు

  • అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు దారుణంగా ప్రవర్తించారు
  • జంగారెడ్డిగూడెం మరణాల గురించే మాట్లాడారు
  • అవన్నీ సహజ మరణాలే
ఈసారి అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా కొనసాగాయని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కరోనా వల్ల గతంలో సమావేశాలు అనుకున్నట్టుగా జరగలేదని... ఈసారి మాత్రం 12 రోజుల పాటు అనేక అంశాలపై చర్చ జరిపి, నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. 

అయితే, ప్రతిపక్ష టీడీపీ తీరు దారుణంగా ఉందని విమర్శించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సభకు రానని భీష్మ ప్రతిజ్ఞ చేశారని... మరి వాళ్ల అబ్బాయి లోకేశ్, ఇతర సభ్యులు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఈ ద్వంద్వ వైఖరి ఎందుకని అడిగారు. 

సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి టీడీపీ సభ్యులు దారుణంగా ప్రవర్తించారని అంబటి రాంబాబు మండిపడ్డారు. తొలిరోజే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారని... తొలిరోజు నుంచి చివరి వరకు జంగారెడ్డిగూడెం మరణాల గురించే వాళ్లు మాట్లాడారని చెప్పారు. వాస్తవానికి జంగారెడ్డిగూడెంలో సంభవించినవి సహజ మరణాలేనని, వాటిని సారా మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

చంద్రబాబు బయట ఉండి వారి పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారని అన్నారు. అందుకే వారు విజిల్స్ తెచ్చి సభని ఎగతాళి చేశారని, మరుసటి రోజు చిడతలు తెచ్చి వాయించారని దుయ్యబట్టారు. అసహనంతో ఉన్న చంద్రబాబు వ్యవస్థలను అగౌరవపరిచేలా వ్యవహరించారని అన్నారు.


More Telugu News