ధోనీ, కోహ్లీ కెప్టెన్సీలు లేకుండా ఐపీఎల్ సమరం.. 

  • ఇద్దరూ ఒకే సీజన్ నుంచి కెప్టెన్సీకి దూరం
  • ఆర్సీబీ, సీఎస్కేకు సుదీర్ఘకాలంగా నాయకత్వం
  • భారత జట్టుకు కూడా ఘనమైన సేవలు
  • జట్టు సభ్యులుగా ఆడనున్న దిగ్గజ క్రికెటర్లు
భారత క్రికెట్ జట్టును ఎన్నో ఏళ్లు సమర్థవంతంగా నడిపించిన రెండు దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ. ఐపీఎల్ లోనూ వీరు ఇరువురూ ఒక్కో జట్టును ఆది నుంచి నడిపించారు. కోహ్లీ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు కెప్టెన్ గా 2013న ఎంపికయ్యాడు. నాటి నుంచి 2021 సీజన్ వరకు నాయకుడిగా ఆర్సీబీని నడిపించిన కోహ్లీ.. ఒక్క టైటిల్ ను కూడా తెచ్చివ్వలేకపోయాడు. మహేంద్ర సింగ్ ధోనీ 2008 నుంచి (మధ్యలో రెండేళ్ల నిషేధం కాలం మినహా) చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా పనిచేశాడు. 

కోహ్లీ 2022 సీజన్ కు కెప్టెన్ గా వ్యవహరించబోనని గతేడాది ఐపీఎల్ అనంతరం తేల్చి చెప్పాడు. దాంతో ఇటీవలి మెగా వేలంలో ఫాప్ డూప్లెసిస్ ను ఆర్సీబీ యాజమాన్యం కొనుగోలు చేసి, అతడికి కెప్టెన్సీ పగ్గాలను అప్పగించింది. కానీ, ధోనీ మాత్రం సీఎస్కేలోనే సీనియర్ అయిన జడేజాను భావి నాయకుడిగా ముందే గుర్తించి తర్ఫీదు నిస్తూ వచ్చాడు. మరో మూడు రోజుల్లో ఐపీఎల్ 2022 సమరం మొదలవుతుందనగా.. కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకుని జడేజాను తెరపైకి తీసుకొచ్చాడు. 

అంటే అటు కోహ్లీ కెప్టెన్సీ లేకుండా ఆర్సీబీ, ఇటు ధోనీ కెప్టెన్సీ లేకుండా సీఎస్కే టైటిల్ సమరంలో పాల్గొననున్నాయి. కాకపోతే దిగ్గజాలైన ధోనీ, కోహ్లీ ఆయా జట్లలో సభ్యులుగా కొనసాగడం సానుకూలం. నూతన కెప్టెన్ లకు వారు తమ వంతు సహకారాన్ని అందించనున్నారు. ఈ క్రమంలో ఈ రెండు జట్లలో ఏదేనీ టైటిల్ సాధించిందంటే అదొక కొత్త రికార్డు అవుతుంది.

విరాట్ కోహ్లీ ఐపీఎల్ రికార్డులు
కోహ్లీ 140 ఐపీఎల్ మ్యాచ్ లకు కెప్టెన్ గా పనిచేశాడు. 66 మ్యాచుల్లో జట్టును గెలిపించాడు. విజయం రేటు 47.16%. కోహ్లీ 139 ఇన్నింగ్స్ లలో 4,871 పరుగులు సాధించగా, అందులో ఐదు శతకాలున్నాయి.

ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రికార్డులు
కెప్టెన్ గా 204 మ్యాచ్ లకు వ్యవహరించాడు. అందులో 121 మ్యాచుల్లో విజయం వరించింది. సక్సెస్ రేటు 59.6 %. గెలుచుకున్న ఐపీఎల్ టైటిళ్లు 4.


More Telugu News