చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీపై రవీంద్ర జడేజా స్పందన

  • ఎల్లుండి ఐపీఎల్ ప్రారంభం
  • సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ
  • ధోనీ స్థానంలో జడేజాకు పగ్గాలు
  • సంతోషంగా ఉందన్న జడేజా
  • ధోనీ అండగా ఉంటాడని వ్యాఖ్యలు
డాషింగ్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ గా నియమితుడవడం తెలిసిందే. ఐపీఎల్-15 మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో, చెన్నై జట్టు యాజమాన్యం అనూహ్య ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంఎస్ ధోనీ స్థానంలో ఇకపై రవీంద్ర జడేజా జట్టుకు నాయకత్వం వహిస్తాడని ప్రకటించింది. ఐపీఎల్ లో నాలుగుసార్లు విజేతగా నిలిచిన చెన్నై వంటి జట్టుకు కెప్టెన్ గా నియమితుడవడంపై జడేజా స్పందించాడు. 

"ఎంతో సంతోషంగా ఉంది. ధోనీ వంటి గొప్ప నాయకుడి స్థానంలోకి వస్తున్నాను. మహీ భాయ్ మహోన్నత వారసత్వాన్ని అందించాడు. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాపై ఉంది. అయితే నాకెలాంటి చింతలేదు. ఎందుకంటే మహీ భాయ్ కూడా జట్టులోనే ఉన్నాడు. ఏ విషయం అయినా ధోనీని అడగ్గలను. గతంలోనే కాదు ఇప్పుడు కూడా నాకు అండగా ఉంటాడు. 

ఇక కెప్టెన్సీ ఓ భారం అనుకోవడం లేదు. ఈ సందర్భంగా నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అభిమానులు మాకు ఎల్లప్పుడూ మద్దతు పలకాలని కోరుకుంటున్నాను" అంటూ జడేజా ఓ వీడియోలో పేర్కొన్నాడు.  ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో విడుదల చేసింది.


More Telugu News