ఆద్యంతం సస్పెన్స్ నడుమ... ఢిల్లీ చేరిన చైనా విదేశాంగ శాఖ మంత్రి!

  • నేటి రాత్రి ఢిల్లీకి చేరిన వ్యాంగ్ ఈ
  • రేపు జైశంక‌ర్‌, అజిత్ దోవ‌ల్‌ల‌తో భేటీ
  • రెండేళ్ల త‌ర్వాత చైనా ఉన్న‌త స్థాయి నేత భార‌త్ రావ‌డం ఇదే ప్ర‌థ‌మం
చైనా విదేశాంగ శాఖ మంత్రి వ్యాంగ్‌ ఈ గురువారం రాత్రి భార‌త రాజ‌ధాని ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రికి విశ్రాంతి తీసుకునే వ్యాంగ్ శుక్ర‌వారం నాడు భార‌త విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్‌తో భేటీ కానున్న‌ట్లుగా స‌మాచారం. 

ల‌డ‌ఖ్ ‌లో చైనా కార్య‌కలాపాల నేప‌థ్యంలో రెండేళ్లుగా భార‌త్‌, చైనా దేశాల మ‌ధ్య స‌త్సంబంధాలు స‌న్న‌గిల్లిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గ‌ల్వాన్ లోయ‌లో ఇరు దేశాల సైనికుల మ‌ధ్య జ‌రిగిన పోరులో ఇరు దేశాల సైనికులు కూడా చ‌నిపోయాక‌.. ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత‌గా స‌న్న‌గిల్లాయి. ఈ నేప‌థ్యంలో రెండేళ్ల త‌ర్వాత‌ చైనాకు చెందిన ఉన్న‌త‌స్థాయి నేత భార‌త్ రావ‌డం ఇదే తొలిసారి.

ఇదిలా ఉంటే.. చైనా విదేశాంగ శాఖ మంత్రి వ్యాంగ్ ఈ భార‌త ప‌ర్యట‌న‌పై చివ‌రి దాకా స‌స్పెన్స్ నెల‌కొంది. వ్యాంగ్ ఢిల్లీలో విమానం దిగేదాకా కూడా ఆయ‌న ప‌ర్య‌ట‌నపై స‌స్పెన్స్ నెల‌కొంది. చైనా విదేశాంగ శాఖ మంత్రి భార‌త్ వ‌స్తున్నారా? అన్న మీడియా ప్ర‌శ్న‌ల‌కు త‌మ‌కేమీ తెలియ‌దంటూ ఇటీవ‌లే భార‌త విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. మొత్తంగా చైనాలో బ‌య‌లుదేరి.. ఆఫ్ఘ‌నిస్థాన్ మీదుగా వ‌చ్చిన వ్యాంగ్ ఢిల్లీలో ల్యాండ‌య్యే దాకా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌పై సాంతం స‌స్పెన్స్ న‌డిచింది.


More Telugu News