అమ‌రావ‌తిపై హైకోర్టు తీర్పుపై జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

  • వికేంద్రీక‌ర‌ణ‌కే క‌ట్టుబ‌డి ఉన్నాం
  • హైకోర్టు త‌న ప‌రిధి దాటింద‌న్న భావ‌న క‌లిగింది
  • అందుకే అసెంబ్లీలో మాట్లాడాల్సి వ‌స్తోంది
  • ఏ వ్య‌వ‌స్థ అయినా త‌న ప‌రిధిలోనే ప‌నిచేయాలి
  • లేదంటే మిగిలిన వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలుతాయి
  • అసెంబ్లీలో సుదీర్ఘ ప్ర‌సంగం చేసిన జ‌గ‌న్‌
ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాలంటూ ఇటీవ‌ల ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం నాటి అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా మూడు రాజ‌ధానుల అంశంపై జ‌రిగిన స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ‌లో పాలుపంచుకున్న జ‌గ‌న్‌.. దీనిపై సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. రాష్ట్ర రాజ‌ధాని, దాని ఎంపిక‌, అభివృద్ధి, వికేంద్రీక‌ర‌ణ, శాస‌న‌స‌భ‌కు ఉన్న అధికారాలు, న్యాయ వ్య‌వ‌స్థ‌కు ఉన్న ప‌రిధి త‌దిత‌ర అంశాల‌న్నింటిపైనా జ‌గ‌న్ సుదీర్ఘంగా మాట్లాడారు. 

తొలుత శాస‌న వ్య‌వ‌స్థ‌, న్యాయ వ్య‌వస్థ‌, కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థ‌ల ప‌రిధుల‌ను ప్ర‌స్తావించిన జ‌గ‌న్‌.. రాజ్యాంగంలో ఏ వ్య‌వ‌స్థ ప‌రిధి ఏమిట‌న్న‌ దానిని స్ప‌ష్టంగా వివ‌రించార‌ని పేర్కొన్నారు. ఇలాంటి నేప‌థ్యంలో ఏ వ్య‌వ‌స్థ అయినా త‌న ప‌రిధిలో ప‌నిచేస్తేనే.. మిగిలిన వ్య‌వ‌స్థ‌ల‌న్నీ స‌జావుగా సాగుతాయ‌ని ఆయ‌న అన్నారు. లేనిప‌క్షంలో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలిపోతాయ‌ని కూడా జ‌గ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

 మంచి చ‌ట్టాలు చేయ‌క‌పోతే ప్ర‌జ‌లే నిర్ణ‌యం తీసుకుంటార‌న్న జ‌గ‌న్‌.. మంచి చ‌ట్టాల‌ను చేస్తే అవే ప్ర‌భుత్వాల‌ను ప్ర‌జ‌లు మ‌ళ్లీ ఎన్నుకుంటార‌ని చెప్పారు. వెన‌క్కు తీసుకున్న చ‌ట్టంపై హైకోర్టు తీర్పు ఇవ్వ‌డ‌మేమిట‌ని జ‌గ‌న్ ప్రశ్నించారు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ల‌క్ష‌ల కోట్లు వెచ్చించి రాజ‌ధానిని అభివృద్ధి చేయాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేయ‌డం స‌రికాద‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. 

అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అయిన కార‌ణంగానే రాష్ట్ర విభ‌జ‌న డిమాండ్లు వ‌చ్చాయ‌ని చెప్పిన జ‌గ‌న్‌.. భ‌విష్య‌త్తులో అలాంటి ప్ర‌మాదం లేకుండా వికేంద్రీక‌ర‌ణ‌కు తాము ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్నారు. వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని శివ‌రామకృష్ణ‌న్ క‌మిష‌న్ కూడా చెప్పింద‌ని ఆయ‌న తెలిపారు. వికేంద్రీక‌ర‌ణ‌కే త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని మ‌రోమారు తేల్చి చెప్పారు. 

హైకోర్టు తీర్పు చూస్తే.. రాజ్యాంగ‌ప‌రంగానే కాకుండా రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఉన్న అధికారాల‌ను కూడా ప్ర‌శ్నించేలా తీర్పు ఉంద‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. ఈ కార‌ణంగానే హైకోర్టు త‌న ప‌రిధిని దాటింద‌ని త‌మ మ‌నోభావాల్లో ఉంద‌ని చెప్పిన జ‌గ‌న్‌.. ఈ కార‌ణంగానే దీనిపై అసెంబ్లీలో మాట్లాడాల్సి వ‌స్తోంద‌ని తెలిపారు. 

రాజ‌ధాని ఎక్క‌డ ఉండాల‌నే దానితో పాటు పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌పై రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఎలాంటి అధికారం లేద‌ని హైకోర్టు తీర్పు చెప్పింద‌న్నారు. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఈ అధికారాలు కేంద్రం ప‌రిధిలో ఉంటాయ‌ని హైకోర్టు చెప్పింద‌న్నారు. అయితే రాష్ట్ర రాజధాని ఎంపికపై పూర్తి నిర్ణ‌యాధికారం రాష్ట్రానికే ఉంటుంద‌ని కేంద్రం వెల్ల‌డించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ గుర్తు చేశారు. ఇదే విష‌యాన్ని కేంద్రం అటు పార్ల‌మెంటులోనే కాకుండా ఇటు కోర్టుల్లోనూ తేల్చి చెప్పింద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.


More Telugu News