రేణుకా చౌద‌రి నోట పుష్ప డైలాగ్‌!

  • గెలిచినా, ఓడినా ఖ‌మ్మం ఆడ‌బిడ్డ‌గానే ఉంటా
  • కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిన అవస‌‌రం లేదు
  • పార్టీ కార్య‌క‌ర్త‌లు ఉక్రెయిన్ సైనికుల్లా పోరాడాల‌ని రేణుక పిలుపు
కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేత‌గా పేరున్న మాజీ ఎంపీ రేణుకా చౌద‌రి త‌న పార్టీ స్టామినా గురించి ఓ డైలాగ్ వ‌దిలారు. కాంగ్రెస్ పార్టీ అంటే సామాన్యం కాద‌న్న ఆమె.. కాంగ్రెస్ పార్టీ అంటే ఫైర్ అంటూ ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. వెర‌సి అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప‌లోని ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌ను ఆమె వల్లె వేశారు. త‌న పార్టీ గొప్ప‌త‌నాన్ని చెబుతూనే.. టీఆర్ఎస్‌, బీజేపీల‌పై విమ‌ర్శ‌లు సంధించారు. 

గ‌త కొంత‌కాలంగా సైలెంట్‌గా ఉన్న రేణుకా చౌద‌రి.. తాను ఎక్క‌డికీ పోలేద‌ని గురువారం వ్యాఖ్యానించారు. నివురు గ‌ప్పిన నిప్పులా కాచుకుని కూర్చున్నానంటూ ఆమె అన్నారు. గ్రూపు రాజ‌కీయాలు వ‌ద్ద‌న్న భావ‌న‌తోనే సైలెంట్‌గా ఉన్నాన‌ని చెప్పిన ఆమె.. త‌న‌కంటే బెట‌ర్‌గా ప‌నిచేస్తారేమోన‌ని వెయిట్ చేశాన‌ని చెప్పారు. గెలుపు కోసం జిల్లాలు మార్చే నేత‌లు ఉన్నార‌న్న రేణుక‌.. గెలిచినా, ఓడినా తాను ఖ‌మ్మం ఆడ‌బిడ్డ‌గానే ఉంటాన‌ని తెలిపారు. త‌న‌కు ప‌ద‌వులు ముఖ్యం కాద‌ని, కార్య‌క‌ర్త‌ల మ‌నోభీష్టానికి అనుగుణంగానే న‌డుచుకుంటాన‌న్నారు. 

త‌న‌కు రాజకీయ వారసులు లేరని చెప్పిన రేణుక‌.. కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ అని, అది ఎక్కడికి పోదని చెప్పారు. ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ జిల్లాగా పేర్కొన్న ఆమె.. తిరుగుబాటు వచ్చేది ఖమ్మం నుంచేన‌ని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్న ఆమె మంత్రి పువ్వాడ అజయ్‌కి తాను భ‌య‌ప‌డ‌బోన‌ని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయేన‌ని చెప్పిన రేణుక‌.. న‌రేంద్ర మోదీవి కేవలం మాటలు మాత్రమేనన్నారు. కాంగ్రెస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్య‌క‌ర్త‌లపై ఉంద‌ని, పార్టీ కార్యకర్తలు ఉక్రెయిన్ సైనికుల్లా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.


More Telugu News