ప‌ద్మావ‌తి నిల‌యంలో బాలాజి జిల్లా క‌లెక్టరేట్ ఏర్పాటుకు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్

  • తిరుప‌తి కేంద్రంగా బాలాజి జిల్లా
  • టీటీడీ ఆధ్వ‌ర్యంలోని ప‌ద్మావ‌తి నిల‌యంలో క‌లెక్టరేట్‌కు ఏర్పాట్లు
  • నిలుపుద‌ల చేసిన హైకోర్టు సింగిల్ జ‌డ్జి బెంచ్‌
  • సింగిల్ జ‌డ్జి ఉత్త‌ర్వుల‌ను కొట్టేసిన డివిజ‌న్ బెంచ్‌
తిరుప‌తి కేంద్రంగా కొత్త‌గా ప్ర‌స్థానం మొద‌లుపెట్ట‌నున్న బాలాజి జిల్లాకు సంబంధించి జిల్లా క‌లెక్ట‌రేట్ కార్యాల‌యం న‌గ‌రంలోని ప‌ద్మావ‌తి నిల‌యంలో ఏర్పాటు కావడానికి అడ్డంకులు తొలగాయి. ఈ మేర‌కు ఏపీ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ కాసేప‌టి క్రితం తీర్పు చెప్పింది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని ప‌ద్మావ‌తి నిల‌యంలో క‌లెక్ట‌రేట్‌ను ఎలా ఏర్పాటు చేస్తారంటూ దాఖ‌లైన పిటిష‌న్‌ను విచారించిన సింగిల్ జ‌డ్జి బెంచ్.. ప‌ద్మావ‌తి నిల‌యంలో క‌లెక్ట‌రేట్ ఏర్పాటు కుద‌ర‌ద‌ని ఇటీవ‌లే తీర్పు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

సింగిల్ జ‌డ్జి ఇచ్చిన తీర్పును ఏపీ ప్ర‌భుత్వం డివిజన్ బెంచ్‌లో స‌వాల్ చేసింది. ఏపీ ప్ర‌భుత్వ పిటిష‌న్‌పై గురువారం నాడు విచార‌ణ చేప‌ట్టిన డివిజ‌న్ బెంచ్ సింగిల్ జడ్జి ఆదేశాల‌ను కొట్టేసింది. అంతేకాకుండా క‌లెక్ట‌రేట్ కోసం ప‌ద్మావ‌తి నిల‌యంలో మార్పుల కోసం క‌లెక్ట‌ర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను నిలుపుద‌ల చేసిన సింగిల్ జ‌డ్జి ఆదేశాల‌ను కూడా డివిజ‌న్ బెంచ్ ర‌ద్దు చేసింది. వెర‌సి ప‌ద్మావ‌తి నిల‌యంలోనే బాలాజి జిల్లా క‌లెక్ట‌రేట్ కార్యాల‌యం ఏర్పాటు కానుంది.


More Telugu News