సామూహిక హత్యల వెనుక ఏదో పెద్ద పన్నాగమే ఉంది: మమతా బెనర్జీ

  • పశ్చిమబెంగాల్ లో ఓ గ్రామంలో హింసాకాండ
  • టీఎంసీ నేత హత్య
  • హత్య అనంతరం గ్రామంలో అల్లర్లు
  •  8 మంది సజీవదహనం
  • భోగ్తుయి గ్రామంలో పర్యటించిన మమత
పశ్చిమ బెంగాల్ లోని బిర్భూమ్ జిల్లాలో జరిగిన ఘాతుకం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక టీఎంసీ నేత భాదు షేక్ హత్య అనంతరం జరిగిన హింసాకాండలో భోగ్తుయి గ్రామంలో ఎనిమిది మందిని సజీవదహనం చేశారు. ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేడు భోగ్తుయి గ్రామంలో పర్యటించారు. మృతుల కుటుంబసభ్యులను సీఎం పరామర్శించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజకీయ హింసను, అరాచకత్వాన్ని బీజేపీ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. దీనివెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ హింసకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు, అక్కడికక్కడే ఓ పోలీసు ఉన్నతాధికారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హింసాత్మక చర్యలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను శిక్షించాలంటూ మమత స్పష్టం చేశారు.

కాగా, భోగ్తుయి గ్రామంలో చోటు చేసుకున్న అల్లర్లలో దహమైన ఇళ్ల మరమ్మతులకు రూ.2 లక్షల చొప్పున ప్రకటించారు. తొలుత మమత రూ.1 లక్ష ప్రకటించగా, ఆ మొత్త సరిపోదని బాధిత కుటుంబాలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ఆ మొత్తాన్ని రూ.2 లక్షలు చేశారు.


More Telugu News