హిజాబ్ పై సుప్రీంలో పిటిషన్లు.. అత్యవసర విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరణ!

  • పరీక్షలతో హిజాబ్ కు సంబంధమేంటని నిలదీత
  • విషయాన్ని సంచలనం చేయవద్దంటూ పిటిషనర్లకు చురక
  • పరీక్షల నేపథ్యంలో అత్యవసర విచారణ జరపాలన్న పిటిషనర్లు
  • లేకపోతే ఏడాది చదువు పోతుందన్న వారి తరఫు అడ్వొకేట్
హిజాబ్ మీద కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకెక్కిన పిటిషనర్లకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలంటూ పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తోసిపుచ్చారు. 

వచ్చే వారం నుంచే పరీక్షలున్నాయని, విచారణను త్వరగా చేపట్టాలని పేర్కొంటూ పిటిషనర్లలోని ముస్లిం విద్యార్థినుల్లో ఒకరైన ఐషా షిఫా తరఫున సీనియర్ అడ్వొకేట్ దేవదత్ కామత్ కోరారు. హిజాబ్ ఉంటే లోపలికి రానివ్వడం లేదని, పరీక్షలు రాయకుంటే విద్యార్థినులు ఒక సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుందని కామత్ కోర్టుకు చెప్పారు.

అయితే, హిజాబ్ తో పరీక్షలకేం సంబంధమని సీజేఐ జస్టిస్ రమణ ప్రశ్నించారు. ఈ అంశాన్ని పరీక్షలతో ముడి పెట్టవద్దని, విషయాన్ని సంచలనం చేయొద్దని సూచించారు. ఇక, వ్యాజ్యాన్ని ఎప్పుడు విచారిస్తామన్నదీ ఆయన స్పష్టంగా చెప్పలేదు. అంతేగాకుండా కర్ణాటక ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మధ్యలో జోక్యం చేసుకోబోతుండగా.. జస్టిస్ రమణ వారించారు. 

ముస్లిం మతాచారాల్లో ‘హిజాబ్’ భాగం కాదని, విద్యాసంస్థల్లో హిజాబ్ పై నిషేధం విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని గత నెల మార్చి 15న కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ ఖాజీ ఎం. జస్టిస్ కృష్ణ దీక్షిత్ ల త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. 

అయితే, ఆ తీర్పును సవాల్ చేస్తూ.. అర్జంటుగా విచారించాలంటూ గత వారం ఐదుగురు విద్యార్థినులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే, హోలీ పండుగ సెలవుల తర్వాత విచారిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తేల్చి చెప్పారు.


More Telugu News