ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు.. పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు జరిమానా

  • కైబర్-ఫఖ్తున్క్వాలో స్థానిక సంస్థల ఎన్నికలు
  • అమల్లో ఉన్న ఎన్నికల కోడ్
  • నియమావళి ఉల్లంఘించి ర్యాలీ, ప్రసంగం
ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతారు చేస్తూ ర్యాలీ నిర్వహించి ఆపై ప్రసంగించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఆ దేశ ఎన్నికల సంఘం జరిమానా విధించింది. అక్కడి కైబర్-ఫఖ్తున్క్వా ప్రావిన్సులో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి  స్వాత్‌ను సందర్శించొద్దని, బహిరంగ సభలో పాల్గొనవద్దని పాక్ ఎన్నికల సంఘం (ఈసీపీ) ఇమ్రాన్‌పై నిషేధం విధించింది. అయితే, ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోని ఇమ్రాన్ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. 

దీనిని తీవ్రంగా పరిగణించిన ఈసీపీ ఇమ్రాన్‌కు రూ.50 వేల జరిమానా విధించింది. కైబర్-ఫఖ్తున్క్వాలో ఈ నెల 31న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు ఎవరూ పర్యటించరాదని ఈసీపీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఇమ్రాన్‌కు ఈసీపీ రెండుసార్లు నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ నోటీసులను సవాలు చేస్తూ ఇమ్రాన్, ప్రణాళికా శాఖ మంత్రి అసద్ ఒమర్ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడా వారికి ఎదురుదెబ్బ తగిలింది.


More Telugu News