ఎగుమతుల్లో దుమ్మురేపి రికార్డ్ సృష్టించిన భారత్.. చరిత్రలో ఇదే అత్యధికం!

  • రూ.30,46,180 కోట్ల విలువైన ఎగుమతులు
  • ఆర్థిక సంవత్సరానికి ఇంకా 9 రోజులుండగానే ఘనత
  • రైతులు, చేనేత కార్మికులు, చిన్న పరిశ్రమ వర్గాలకు ప్రధాని కృతజ్ఞతలు
ఎగుమతుల్లో భారత్ రికార్డు సృష్టించింది. పెట్టుకున్న టార్గెట్ ను అనుకున్న గడువు కన్నా ముందే అందుకుంది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 9 రోజులు మిగిలుండగానే 40 వేల కోట్ల డాలర్ల (సుమారు రూ.30,46,180 కోట్లు) విలువైన వస్తు ఎగుమతులను చేసి పెట్టుకున్న టార్గెట్ ను చేరింది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా తొలిసారి అత్యధిక మొత్తం విలువైన సరుకులను భారత్ విదేశాలకు ఎగుమతి చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఎగుమతులు 37 శాతం పెరగడం విశేషం. 

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రైతులు, చేనేత కార్మికులు, చిన్న మధ్య తరగతి పరిశ్రమ వర్గాలు, ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం వెనుక వారి శ్రమ ఎంతో ఉందని కొనియాడారు. ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో ఇది కీలకమైన ముందడుగని ఆయన ట్వీట్ చేశారు. 

వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర ప్రభుత్వం 65 వేల కోట్ల డాలర్ల (సుమారు రూ.49.53 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 25 వేల కోట్ల డాలర్లు (సుమారు రూ.19,03,975 కోట్లు) సేవల ఎగుమతులపై పెట్టుకుంది. మిగతా 40 వేల కోట్ల డాలర్లు వస్తు సేవల ఎగుమతులపై లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు దానిని అందుకుంది. 

2021 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 30 వేల కోట్ల డాలర్ల (సుమారు రూ.22,84,770 కోట్ల) విలువైన వస్తు ఎగుమతులు జరిగాయి. కాగా, ఎగుమతుల ఘనతపై కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి తదితరులు అభినందనలు తెలియజేశారు.


More Telugu News