అచ్చెన్నాయుడు హౌస్ అరెస్ట్.. ఇంటి చుట్టూ పోలీసులు

  • కల్తీ సారా, జే బ్యాండ్  మద్యంపై టీడీపీ నిర‌స‌న‌కు పిలుపు
  • ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్దకు రాకుండా పోలీసుల చ‌ర్య‌లు
  • మండిప‌డ్డ అచ్చెన్నాయుడు
విజయవాడలోని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆయ‌న బ‌య‌ట‌కు రాకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కల్తీ సారా, జే బ్యాండ్ మద్యం తాగి ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నారంటూ ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద టీడీపీ నిరసనకు పిలుపునివ్వ‌డ‌మే ఇందుకు కార‌ణం. 

టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్దకు రాకుండా ముందస్తుగా వారిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడలోని దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, బోండా ఉమ, గద్దె రామ్మోహన్ వంటి వారి ఇంటి వ‌ద్ద కూడా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. 

కాగా, పోలీసుల తీరుపై అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. తాను పార్టీ కార్యాలయానికి వెళ్తున్నానని చెప్పారు. ఏపీ ప్ర‌జ‌లు ప్రజాస్వామ్య పాల‌న‌లోనే ఉన్నారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. టీడీపీ నాయకులను వెంటనే విడిచిపెట్టాలని ఆయ‌న డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెంలో ఇటీవ‌ల‌ 27 మంది కల్తీ సారా తాగి మృతి చెందార‌ని, అయిన‌ప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 

ఈ విష‌యంపై అసెంబ్లీలో చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేస్తోంద‌ని, చ‌ర్చ జ‌ర‌ప‌కుండా స్పీక‌ర్ త‌మ‌ను సస్పెండ్ చేస్తున్నారని ఆయ‌న అన్నారు. కారణాలు చెప్పకుండా పోలీసులు ప్రజాప్రతినిధులను అడ్డుకోవటం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేన‌ని చెప్పారు. పోలీసులు జగన్ రెడ్డికి తొత్తులుగా మారి, అర్ధరాత్రి నుంచి ఇంటి చుట్టూ మోహరించి, హౌస్ అరెస్టు చేశారని ఆరోపించారు. 

ప్రతిపక్షం ప్రజలలోకి వెళితే జగన్ రెడ్డికి ఉలుకెందుకు? అని ఆయ‌న వ్యాఖ్యానించారు. జే బ్రాండ్, కల్తీ సారా అమ్మకాలపై నిరసనను అడ్డుకునేందుకు విజయవాడలోని కరెన్సీనగర్ లో అర్ధ‌రాత్రి నుంచి వైసీపీ ప్రభుత్వం తనను పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయించి, ఇంటి వద్ద పికెటింగ్ ఏర్పాటు చేయించిందని చెప్పారు. పోలీసులను వాడి ప్ర‌భుత్వం మీద‌ ఉన్న ప్రజా వ్యతిరేకతను అణచివేయాలని చూడడం జ‌గన్ అవివేక‌మ‌ని ఆయ‌న అన్నారు.


More Telugu News