సికింద్రాబాద్ అగ్నిప్ర‌మాదంపై మోదీ, ప‌వ‌న్ దిగ్భ్రాంతి

  • మృతుల కుటుంబాలకు సంతాపం
  • రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రధాని 
  • వలస కార్మికుల సజీవ దహనం బాధాకరమన్న పవన్ 
సికింద్రాబాద్ బోయగూడలోని ఓ టింబర్, స్క్రాప్ దుకాణంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 11 మంది బీహార్ వలస కార్మికులు సజీవ దహనం అయిన విష‌యం తెలిసిందే. దీనిపై ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఆయా కుటుంబాలకు రెండు లక్షల రూపాయ‌ల‌ చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. 

మ‌రోవైపు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు. అగ్ని ప్రమాదంలో వలస కార్మికుల సజీవ దహనం బాధాకరమ‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌ల‌చివేసింద‌ని చెప్పారు. ఉపాధి కోసం బీహార్ నుంచి వ‌ల‌స వ‌చ్చిన కూలీలు ఈ దుర్ఘ‌ట‌న‌లో మృత్యువాత ప‌డ‌డం అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మంటూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆయా కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాన‌ని చెప్పారు. 

సికింద్రాబాద్ అగ్ని ప్ర‌మాదంలో కూలీల‌ మృతి ఎంతో క‌ల‌చివేసిందని వైఎస్సార్ టీపీ అధినేత్రి ష‌ర్మిల పేర్కొన్నారు. బాధిత కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు చెప్పారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదేన‌ని అన్నారు. బాధిత కుటుంబాల‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

కాగా, ఘోర అగ్ని ప్రమాదం ఘ‌‌ట‌న‌పై తెలంగాణ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ఉంది. స్క్రాప్ గోదాం ఘటనపై అధికారులతో మాట్లాడామ‌ని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. కాసేప‌ట్లో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, విజిలెన్స్ అధికారులతో సమావేశమవుతామని తెలిపారు. గోదాం యజమాని నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఆయ‌న‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఖర్చులతోనే మృతదేహాలను బీహార్‌కు తరలిస్తామన్నారు. ఇలాంటి గోదాంలు న‌గ‌రంలో ఎన్ని ఉన్నాయో తెలుసుకుని, రక్షిత చర్యలు తీసుకుంటామన్నారు. 


More Telugu News