అలాంటి ఛండాలపు బుద్ధి వైసీపీ ప్రభుత్వానికి లేదు: స్పై వేర్ అంశంపై గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలు

  • ఏపీలో పెగాసస్ ప్రకంపనలు
  • అసెంబ్లీలోనూ ఇదే రగడ
  • వ్యక్తిగత అంశాలపై నిఘా సరికాదన్న అమర్ నాథ్ 
  • రాష్ట్ర ప్రయోజనాల కోసమే వినియోగించాలని స్పష్టీకరణ
స్పై వేర్లు వాడడానికి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ అన్నారు. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా సంఘవిద్రోహ శక్తులపై నిఘా వేయడానికి, భద్రతా పరమైన చర్యల కోసం ఫోన్ ట్యాపింగ్ పరికరాలను, కొన్ని సాఫ్ట్ వేర్లను వాడడం సహజమని వెల్లడించారు. కానీ, ఇలాంటి వ్యవస్థలను వ్యక్తిగత అంశాలపై నిఘా కోసం ఉపయోగించడాన్ని తాము తప్పుబడుతున్నామని అమర్ నాథ్ స్పష్టం చేశారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా ఉన్న చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. 

వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు సజ్జల ఫోన్ ట్యాపింగ్ చేశారన్న అంశంపై తాము కోర్టుకు కూడా వెళ్లామని వివరించారు. ఇలాంటి సాఫ్ట్ వేర్లను ఓ ప్రభుత్వం ఉపయోగిస్తే, ఆ రాష్ట్ర భద్రత కోసమో, ప్రభుత్వ భద్రత కోసమో వాడాలి తప్ప, రాజకీయాల కోసం వాడడం సమంజసం కాదని గుడివాడ అమర్ నాథ్ అభిప్రాయపడ్డారు. 

"మీ ప్రభుత్వం కూడా ఇలాంటివి వాడుతోంది అంటే వాడుతుంటాం... రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భద్రత కోసం వాడుతుంటాం. అంతేతప్ప, చంద్రబాబునాయుడు ఏం చేస్తున్నాడు? చంద్రబాబునాయుడు తన భార్యతో ఏం మాట్లాడుతున్నాడు? ఆయన కొడుకు, కోడలు ఏం మాట్లాడుకుంటున్నారు? అనే విషయాలపై నిఘా వేసే ఛండాలపు బుద్ధి వైసీపీ ప్రభుత్వానికి లేదు" అని అమర్ నాథ్ స్పష్టం చేశారు.


More Telugu News