125 ఏళ్ల వయసులో సాష్టాంగ నమస్కారం చేసి.. పద్మశ్రీని అందుకున్న శివానంద
- రాష్ట్రపతి, ప్రధానికి సాష్టాంగ నమస్కారం
- రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం ప్రదానం
- యోగా రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపు
యోగా గురువు, 125 ఏళ్ల స్వామి శివానంద రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ సమయంలో రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ లో అతిథులు నిలబడి చప్పట్లతో తమ గౌరవాన్ని చాటారు. కానీ దీని కంటే ముందే స్వామి శివానంద తన వినయతను చాటుకున్నారు.
అంత పెద్ద వయసులో ఉండి కూడా పద్మశ్రీ పురస్కారాన్ని తీసుకోవడానికి ముందు ప్రధాని నరేంద్రమోదీకి సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రధాని మోదీ సైతం కుర్చీ నుంచి లేచి రెండు చేతులు నేలపై ఆనించి ప్రతి నమస్కారం తెలియజేశారు. అనంతరం స్వామి శివానంద రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉన్న వైపు వెళ్లి ఆయనకు సైతం సాష్టాంగ నమస్కారం చేశారు. దీంతో రాష్ట్రపతి స్వయంగా వచ్చి స్వామిని పైకి లేవదీశారు. అనంతరం అవార్డును ఇచ్చి సత్కరించారు.
‘‘హృదయాన్ని హత్తుకుంటోంది. కాశీకి చెందిన 125 ఏళ్ల యోగా గురు, స్వామి శివానంద యోగా రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు’’ అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.